మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాజకీయ నాయకులు, పోలీసులు పాల్గొని... అమరవీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని కార్గిల్ స్థూపానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. 2003 జూలైలో జరిగిన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన వారి కోసం ఈ కార్గిల్ స్థూపాన్ని 2004 జూలై 26న ఆవిష్కరించినట్లు కార్గిల్ సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ తెలుగు రాష్ట్రాల ఛైర్మన్ గాదె రాంబాబు తెలిపారు.
కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు భారత త్రివిధ దళాలు ప్రతిక్షణం సిద్ధంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు వద్దిరాజు రామచందర్ రావు, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి జాటోతు హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు.