అవసరాలే ఆవిష్కరణలకు దారి చూపుతాయనే మాట మరోసారి రుజువైంది. ఖాళీ సమయంలో బైక్ మెకానిక్‌గా పనిచేసే ఓ యువకుడు అహర్నిశలు కష్టపడుతున్న తన తండ్రికి అణువంతైనా ఆసరా కావాలనుకున్నాడు. తండ్రి చేసే పనినే మరింత సులువుగా ఎలా చేయొచ్చో ఆలోచించాడు. పదును పెడితే.. మట్టితో చేసిన ఆయుధం కూడా బ్రహ్మాస్త్రంగా మారుతుందంటారు. ఈ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది. తక్కువ ఖర్చుతో పాత బైక్‌తో గొర్రు యంత్రాన్ని తయారు చేసే ఆలోచన వచ్చింది. వెంటనే.. ఆలోచనను ఆచరణలో పెట్టాడు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ఇందిరా నగర్ తండాకు చెందిన గంగావత్ సంతోష్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఖాళీ సమయాల్లో ద్విచక్ర వాహనాల మెకానిక్‌గా పని చేస్తాడు. తండ్రి భావ్‌సింగ్. సాదారణ రైతు. ఎద్దులు, ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నడం వ్యవసాయం చేయడం మాత్రమే తెలిసిన వాడు. ఓ రోజు తండ్రి గొర్రు కొడుతుండగా సంతోష్ తదేకంగా చూశాడు. తండ్రి చేసే పనిని చిన్న యంత్రంతో.. సులభంగా.. తొందరగా అయిపోయేలా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కత్తిలాంటి ఐడియా వచ్చింది. వెంటనే తాను పనిచేసే బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్లి రూ.2500 లకు ఓ పాత టీవీఎస్ బైక్ కొనుగోలు చేశాడు. నాలుగైదు రోజులు అవిరామంగా శ్రమించి గొర్రు యంత్రం తయారు చేశాడు. ముందుగా తన పొలంలోనే.. ప్రయోగం చేశాడు. ఏముందీ.. ప్రయోగం విజయవంతమైంది. బైక్ ఇంజిన్‌తో తయారు చేసిన ఆ యంత్రంలో పెట్రోల్ పోస్తే చాలు..రోజుకు రెండెకరాల్లో అలసిపోకుండా.. సులభంగా గొర్రు కొట్టవచ్చు. ప్రభుత్వం సహకరిస్తే.. ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేసి.. మరింత మంది రైతులకు అందుబాటులోకి వచ్చేలా చేస్తా అంటున్నాడు సంతోష్. తాను పడుతున్న కష్టానికి తన వంతు సాయంగా గొర్రు యంత్రాన్ని రూపొందించిన కొడుకును చూసి.. బావ్‌సింగ్ మురిసిపోతున్నాడు. గొర్రు యంత్రం కావాలంటే.. తీసుకెళ్లండి. నా కొడుకే తయారు చేశాడు. పని తొందరగా అయిపోతుంది అంటూ.. మురిసిపోతూ.. చెప్తున్నాడు.
ఇదీ చూడండి: ఇసుక అక్రమ రావాణాకు చిరునామాగా ఆ జిల్లా