కరోనాపై పోరులో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళలు ముందువరుసలో ఉన్నారు. కొవిడ్-19 కట్టడిలో భాగంగా మాస్కులు తయారుచేస్తున్నారు.
కరోనాపై పోరుకు మహిళలు మేము సైతం అంటూ కదులుతున్నారు. దగ్గు, తుమ్మల ద్వారా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉండడం వల్ల మాస్కుల తయారీపై దృష్టిపెట్టారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాస్కులు ఉత్పత్తి చేస్తున్నారు.
అతివలంతా సంఘాలుగా ఏర్పడ్డారు. కుట్టుపని తెలిసినవారిని ఎంపిక చేసి మాస్కుల తయారీ బాధ్యత అప్పగించారు. అందుకు కావాల్సిన ముడి సరకును కొన్ని చోట్ల అధికారులే సరఫరా చేస్తుండగా.. మరికొన్ని చోట్ల మహిళలే వస్త్రాలను సమకూర్చుకుంటున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మహిళా సంఘాలకు నగదు చెల్లింపులు చేయనున్నారు.
ఉచితంగానే..
మహిళా సంఘాల సభ్యులు తయారుచేస్తున్న మాస్కులను ప్రజలకు ఉచితంగానే అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఉపాధిహామీ కూలీలు, పింఛనుదారులు, బ్యాంకుల ఎదుట నగదు కోసం వేచిచూసేవారికి, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులను ఉచితంగా అందజేస్తున్నారు.
ఇవీచూడండి: అమృత స్వాతి మెమోరియల్ ట్రస్ట్ దాతృత్వం