ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడపాదడపా పెద్దపులి కదలికలు బయటపడినప్పటికీ మనుషులను హతమార్చిన ఘటనలో ఎప్పుడు చోటు చేసుకోలేదు. కానీ ఈనెల 11న దహేగం మండలం దిగిడ అటవీప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లిన విగ్నేశ్ అనే యువకుడిని పులి హతమార్చింది. ఈ ఘటన అటవీ ప్రాంత ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అప్రమత్తమైన అటవీశాఖ అధికార యంత్రాంగం పెద్దపులి సంచారాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తోంది.
భరోసా కల్పించే ప్రయత్నం...
ప్రధానంగా దహేగం, బెజ్జూర్, పెంచికలపేట మండలాలతో పాటు ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో బోన్లు ఏర్పాట్లు చేస్తోంది. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ నేతృతంలో అధికారులు అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ... ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఎర వేసేందుకు యత్నం...
వరంగల్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి బోన్లను కుమురం భీం జిల్లాకు తెప్పించారు. పులి సంచారం ఉన్న కీలకమైన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోన్లు ఏర్పాటు చేసి మాంసాన్ని ఎరగా వేసి బంధించే ప్రయత్నం జరుగుతోంది. ప్రధానంగా ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా భరోసా ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
పరిహారం...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారంతో కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకుంది.
ఇవీ చూడండి: పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్