ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల ఓ యువతి, మరో యువకుడు పెద్దపులి పంజాకు బలవడం.. పశువుల్ని చంపడం లాంటి ఘటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 20 మంది అటవీ అధికారులు 16న మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు వెళ్లి అక్కడ టైగర్ మేనేజ్‌మెంట్‌పై అధ్యయనం చేశారు.
చంద్రాపూర్ జిల్లాలో రెండొందల పైచిలుకు పెద్దపులులు ఉన్నాయి. పులులకు ఆహారం, ఆవాసం సమస్య లేకుండా చూడటం.. వాటి ద్వారా ప్రజలకు ఆపద కలగకుండా చూసేందుకు.. మహారాష్ట్ర అటవీ శాఖ అవలంబిస్తున్న పద్ధతులపై ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారులు అధ్యయనం చేశారు. ఆ రాష్ట్ర పీసీసీఎఫ్, తడోబా టైగర్ రిజర్వు ఫీల్డ్‌డైరెక్టర్‌తో సమావేశమై పులుల సంరక్షణ, వాటి కదలికలు పసిగట్టడం వంటి విషయాలను తెలుసుకున్నారు. మహారాష్ట్రలో టైగర్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా ఉందని అక్కడికి వెళ్లిన బృందంలోని ఓ అధికారి చెప్పారు.
ప్రతి సర్కిల్‌కూ ఓ బృందం..
మహారాష్ట్రలోని గడ్చిరోలి సహా పులుల ప్రభావిత జిల్లాల్లో ప్రతి అటవీ సర్కిల్‌కు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి వాహనాలు సమకూర్చారు. ఏ పులి ఎక్కడ ఉంది.. ఎటు వెళ్తుందన్న విషయాన్ని కెమెరా చిత్రాలు, పాదముద్రల ఆధారంగా ట్రాక్ చేస్తున్నారు.
ప్రత్యేకతలు..
- చంద్రపూర్‌లో వన్యప్రాణుల కోసం పరిశోధన కేంద్రం, దారితప్పి వచ్చిన, గాయపడ్డ వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఉన్నాయి.
- పులి దాడి చేస్తే తక్షణమే స్పందించడానికి అటవీ సిబ్బందికి ప్రత్యేక వాహనాలు, ట్రాంక్విలైజ్ గన్లు, స్థానికంగానే వెటర్నరీ సిబ్బందిని అందుబాటులో ఉంచడం, మనిషి చనిపోతే రూ.15 లక్షల పరిహారం.
- టైగర్ రిజర్వులో వన్య ప్రాణులు, అటవీ సంపద సంరక్షణకు శిక్షణ పొందిన కమాండోలు గస్తీ కాస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.
సంబంధిత కథనాలు: