కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలోని శివకేశవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది రెండు రోజులపాటు ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.
మహారాష్ట్రలోని చిక్లి నదీతీరాన ఉన్న ఈ ఆలయాన్ని రాణి రుద్రమదేవి నిర్మించారని చరిత్ర చెబుతోంది. మరాఠా యాదవ రాజులపై యుద్ధం చేస్తూ.. రాష్ట్ర సరిహద్దు వాంకిడి వరకు వారిని తరిమికొట్టిన విజయానికి సూచికగా ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
శివకేశవులు ఒకే చోట కొలువు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలోని రేణుకా మాత విగ్రహాలు అదనపు ఆకర్షణ. ఉత్సవ మూర్తులను ఏటా ఊరేగింపుగా తీసుకొచ్చి చిక్లి నదీ తీరాన రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుక.. కన్నుల పండువగా జరుగుతుంది. కొవిడ్‌ను సైతం లెక్క చేయకుండా.. ఈ ఏడాది కూడా.. భక్తులు భారీగా తరలి వచ్చి ఉత్సవాలలో పాల్గొంటుండటం విశేషం.
ఇదీ చదవండి: మహా శివరాత్రి పర్వదినాన ఆరడుగుల శ్వేత నాగు ప్రత్యక్షం