కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి సమీపంలో కుమురంభీం జలాశయం ప్రధాన ఎడమ కాలువకు గత ఏడాది ఆగస్టులో గండిపడింది. స్పందించిన జలాశయ గుత్తేదారు అక్టోబర్లో మరమ్మతులు చేపట్టారు. మట్టి నింపి, లైనింగ్లను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... సరిగ్గా ఏడాది గడవకముందే... రెండు రోజుల క్రితం మరమ్మతులు చేపట్టిన చోటే తిరిగి గండిపడింది.
నాసిరకం పనులు..
కాలువ లైనింగ్ పది కిలోమీటర్ల మేర కొట్టుకుపోయి నీరంతా వృథాగా చిక్కలి వాగులో కలిసిపోతుంది. ఈ నాసిరకం పనులతో గండి పడి... దిగువ ప్రాంతంలో ఉంటున్న పంటలకు నీరందక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
అధికారుల నిర్లక్ష్యం
ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గంలోని మండలాల రైతులకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఆసిఫాబాద్ మండలం అడ గ్రామం వద్ద రూ. 748 కోట్లతో ప్రభుత్వం జలాశయాన్ని నిర్మించింది. ఎడమ కాలువ కింద 39,500 ఎకరాలు, కుడి కాలువ కింద 6 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. ప్రధాన ఎడమ కాలువ పనులు 65 కిలోమీటర్ల పైచిలుకు పూర్తికాగా, కుడి కాలువ పనులు కొనసాగుతున్నాయి. వాంకిడి మండలంలో ప్రధాన కాలువ పనులు పూర్తయిన పంట పొలాలకు నీరు అందించే పిల్ల కాలువల నిర్మాణ పనులు మాత్రం పూర్తి కాలేదు. కొన్ని చోట్ల పనులు పూర్తి కాకముందే కాలువ లైనింగ్లు కుంగిపోయాయి. నీరు వృథాగా పోతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏడాది గడిచినా...
వాంకిడి మండలంలోని బంబారా చెరువుకు గండి పడి ఏడాది గడిచినా మరమ్మతులు చేయలేదు. దీంతో చెరువు కింది ఆయకట్టు రైతుల ఆశలు మరోసారి అడియాశలయ్యాయి. గతేడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు భారీ గండి పడింది. దీంతో చెరువులో నీరు నిలిచే పరిస్థితి లేదు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందకుండా పోయింది. ఏడాది గడిచినా చెరువు గండిని పూడ్చలేదు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది.
వర్షాలు తగ్గిన వెంటనే
దీనిపై సాగునీటి పారుదల శాఖ అధికారి ఆంజనేయులు స్పందించారు. చిన్న వాంకిడి సమీపంలో వాగుపై ప్రధాన కాలువ వెళ్లేలా నిర్మించిన వంతెన వద్ద మట్టి కుంగటం కారణంగా కాలువకు గండి పడుతోందని ఆయన వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని... వర్షాలు తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతామని తెలిపారు. నవయుగ కన్స్ట్రక్సన్స్ చేపట్టిన జలాశయం పనులను... ఇంకా తమకు అప్పగించలేదని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు