రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వాగులపై వంతెన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు దాటడానికి ప్రయత్నిస్తూ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పానపటర్ వాగులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
బైక్‌తో పాటు కొట్టుకుపోయాడు..
జైనూర్ మండలం జామ్గూడ గ్రామానికి చెందిన చిన్ను అనే వ్యక్తి.. పని నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లాడు. పనులు ముగించుకుని సాయంత్రంపూట ఇంటికి బయలుదేరాడు. తన ఊరు వెళ్లాలంటే.. దారిలోని పానపటర్ వాగు దాటాలి. ప్రవాహం తక్కువే ఉందని భావించి చిన్ను.. ద్విచక్రవాహనంపై వాగు దాటడానికి ప్రయత్నించాడు. కొంచెం దూరం వెళ్లగానే ప్రవాహం ఎక్కువైంది. ఈ క్రమంలో ఏం చేయాలో అర్థం కాని చిన్ను.. ముందుకెళ్లడానికి ప్రయత్నించాడు.. కానీ ప్రవాహ ధాటికి తట్టుకోలేక ద్విచక్రవాహనంతో పాటు తాను కూడా కొట్టుకుపోయాడు.
బతికి బయటపడ్డాడు..
కాస్త దూరం కొట్టుకుపోయిన తర్వాత.. అక్కడ ప్రవాహవేగం నెమ్మదించింది. వెంటనే అప్రమత్తమైన చిన్ను.. స్థానికుల సాయంతో బయటపడ్డాడు. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ద్విచక్రవాహనాన్ని బయటకు తీశారు. ప్రతిఏటా వర్షాకాలం వస్తే తమ గ్రామ ప్రజలు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తోందని చిన్ను తెలిపారు. పనుల కోసం బయటకు వెళ్లిన వారు.. ప్రాణాలతో తిరిగి వస్తారోలేరోనని భయపడుతూ బతకాల్సి వస్తోందని వాపోయారు. వాగుపై వంతెన నిర్మించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రాణాలు పోయినా.. అధికారుల్లో చలనం లేదని ఆగ్రహం చెందారు.