కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని గిరివెళ్లి, మొట్లగూడా, రాంపూర్ గ్రామపంచాయతీల్లోని 11 గ్రామాలకు ఈ ఏడాది వంతెన కష్టాలు తప్పడం లేదు. ఈ పంచాయతీలోని గ్రామాలన్నీ అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగింది. అవతలి గ్రామాలకు వెళ్లేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకుపోయింది. ఫలితంగా బాహ్య ప్రపంచానికి దూరంగా బతకాల్సిన పరిస్థితి. గతంలో అత్యవసర పనుల కోసం మండల కేంద్రం వెళ్లడానికి పడవలను ఆశ్రయించేవారు. ఇప్పుడు పడవలు కూడా నడపకపోవడం వల్ల అసంపూర్తిగా ఉన్న వంతెన పైనుంచే ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.
నిధులిచ్చిన నత్తనడకే
2010లో అప్పటి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల నాబార్డు నిధులతో పనులు ప్రారంభించింది. 2013లో వచ్చిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని రీడిజైన్ చేయాలని నిర్ణయించడం వల్ల పిల్లర్ల దశలోనే నిలిచిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా వంతెనను నిర్మించాలని.. ప్రభుత్వం 10కోట్ల 50 లక్షలు మంజూరు చేసింది. 2016లో పనులను గుత్తేదారు ప్రారంభించారు. ఇప్పటికే ఎర్రవాగు వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. నేటికి అసంపూర్తిగానే దర్శనమిస్తోంది.
ఎలాంటి చర్యలు తీసుకోలేదు
ఈ ఏడాదైనా వంతెన పనులు పూర్తి అవుతాయని అనుకున్నా.. వాగు అవతలి గ్రామాల ప్రజలకు నిరాశే మిగిలింది. వర్షాకాలం ప్రారంభమై వాగు ఉప్పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వంతెన నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న సదరు గుత్తేదారుపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సకాలంలో పూర్తి చేస్తామని ప్రజాప్రతినిధుల హామీ ఇచ్చినా ఆశలు అడియాశలే అయ్యాయని స్థానికులు వాపోతున్నారు.
ఇదీ చూడండి: మెట్రో రైలులో పాము.. 2,500 కి.మీ ప్రయాణం