మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి కుమురం భీం సరిహద్దు గోయగాం వరకు రెండు జిల్లాల్లో 94 కి.మీ. మేర రహదారి పనులకు నిధులు రెండేళ్ల క్రితం ఒకేసారి విడుదలయ్యాయి. టెండర్ ప్రక్రియ సైతం ముగిసింది. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో తారురోడ్డు పనులు వేగంగా సాగుతోండగా.. ఆసిఫాబాద్ లో మాత్రం పనులు ప్రారంభం కాలేదు. మరోవైపు భూములు కోల్పోతున్న అనేకమందికి పరిహారం పూర్తి స్థాయిలో అందడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు బాధితులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లాలో 52.60 కి.మీ. మేర నిర్మించే రహదారికి రూ.1140 కోట్లు కేటాయింపులు జరుగగా.. నిర్మాణ పనులు డిసెంబర్, జనవరిలో ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫిబ్రవరి, మార్చిలో మొదలవుతాయని పేర్కొంటున్నారు. వాంకిడి మండలం బుదల్‌ఘాట్ వద్ద ఒకే వాహనం వెళ్లేలా ఉన్న ఇరుకైన వంతెన.. దీనిపై ఉన్న తారు సైతం చెదిరిపోయి గుంతలు తేలాయి. ఒక వాహనం వస్తుంటే మరో వాహనం నిరీక్షించక తప్పటంలేదు. ఇరువైపులా ఎలాంటి రక్షణ గోడలు సైతం లేవు. అలా అనేకచోట్ల రహదారి ఛిద్రమై ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టొచ్చు..
రహదారి విస్తరణ పనులు ఫిబ్రవరిలో చేపట్టే అవకాశం ఉంది. రూ.65.68 కోట్లు పరిహారంగా చెల్లించాలి. ఇప్పటివరకు రూ.38 కోట్లు చెల్లించాం. మిగిలిన సొమ్ము సైతం పక్షం రోజుల్లో పంపిణీ చేస్తాం. పరిహారం చెల్లింపు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం.
- హసన్, అభియంత, ఎన్‌హెచ్‌ఏఐ.
జాబితాలో నా పేరు లేదు..
రహదారి విస్తరణలో భూములు పోయిన రైతులందకి పరిహారం చెల్లించే జాబితాను పంచాయతీలో ప్రదర్శించారు. అందులో నా పేరు లేదు. రహదారి పక్కన సర్వే నంబర్ 33/బీ2లో 1.1080 గుంటల భూమి ఉంది. ఎకరం భూమి పోతోంది. జాబితాలో నా పేరు లేదు. నా పక్కనున్న చేల వారికి పరిహారం వచ్చింది. రెవెన్యూ కార్యాలయాలకు వెళితే వస్తాయనే చెబుతున్నారు.
- లక్ష్మణ్, మోతుగూడ.
ఇదేం పరిహారం:
గ్రామాల్లో రహదారి మధ్య భాగం నుంచి అధికారులు.. ఇరువైపులా 75 అడుగుల స్థలాన్ని సేకరిస్తున్నారు. గ్రామం అవతల 100 అడుగులు తీసుకుంటున్నారు. వాంకిడిలో సర్వే నంబర్ 28/ఏ5లో మాకు ఏడు గుంటల స్థలం ఉంది. ఎదురుగా రెండు ఇళ్లు సైతం నిర్మాణంలో ఉన్నాయి. వాస్తవంగా ఇక్కడ 75 అడుగులు సేకరించాలి. అధికారులేమో వంద అడుగులు తీసుకున్నారు. గుంటన్నర స్థలం పోతోంది. పరిహారం మాత్రం రూ.1.60 లక్షలు ఇస్తామంటున్నారు. రూ.11 లక్షలు పెట్టి తీసుకున్న స్థలమది. పరిహారమైనా పెంచాలి. లేదా 75 అడుగుల స్థలం మాత్రమే తీసుకోవాలని అధికారులను కోరాను.
- గణేష్, ఆసిఫాబాద్
ఇదీ చదవండి: రెండు ప్రారంభం.. మరో రెండు రహదార్లకు నిధులు