ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణం అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 33 శాతం అడవి పెంపు కోసం కృషి చేయాలన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు శాతం కూడా అడవి లేదని తెలిపారు. జూన్ మాసంలోనూ ఎండలు మండిపోతున్నాయంటే అడవులు అంతరించడమే కారణమని అన్నారు.
మొక్కలు నాటడమే..
అడవి అంతరించడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుంచి బయట పడటానికి మొక్కలు నాటడమే మార్గమని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు. పెట్టిన ప్రతి చెట్టును బ్రతికించాలని సూచించారు. ఆరేళ్లుగా నాటిన మొక్కలు ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. రేపటి తరాలకు ఏదో ఇవ్వాలని అనుకుంటాం.. కానీ చెట్లు ఇవ్వాలి, ఆక్సిజన్ ఇవ్వాలి అని సూచించారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల్లోనూ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు.
సద్దుమణిగిన వివాదం
కలెక్టర్ వర్సెస్ జడ్పీ సీఈఓ ఎంపీడీవోల మధ్య జరిగిన వివాదం సద్దుమణిగిందని మంత్రి తెలిపారు. ఎంపీడీవోలు విధుల్లో చేరారని అన్నారు. జడ్పీ సీఈవో కార్యాలయంలో ఎంపీడీవోలతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించి వారి సమస్యలపై కలెక్టర్, జడ్పీ సీఈఓ, ఎంపీడీఓల మధ్య జరిగిన వివాదం తెలుసుకుని సద్దుమణిగేలా చూశారు.
ఇదీ చూడండి : 'మొక్కలు సంరక్షించకపోతే పదవులు, ఉద్యోగాలు పోతాయ్'