కుమురం భీం జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో ఇటీవల పులి దాడిలో మరణించిన పసుల నిర్మల, విగ్నేష్‌ల కుటుంబాల్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. మంత్రితోపాటు పీసీసీఎఫ్ఆర్ శోభ, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప బాలిక తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపరిహారం రూ. 5 లక్షలు అందించామని.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరింత సహాయం అందేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం ఘటనాస్థలిని సందర్శించారు. పత్తి చేలల్లో పులి దాడి చేసిన తీరును అటవీ శాఖ సిబ్బంది మంత్రికి తెలిపారు.
కుమురం భీం జిల్లాలో పులి ఇద్దరిపై దాడి చేసి హతమార్చిన విషయం విదితమే. గత నెల 11న దహేగాం మండలం దిగిడ అటవీ ప్రాంతంలో విగ్నేష్‌ను హతమార్చగా.. 29న పెంచికలపేట మండలం కొండపల్లిలో నిర్మలపై దాడి చేసి చంపేసింది. స్వల్ప వ్యవధిలో పులి ఇద్దరిని పొట్టనబెట్టుకోవడంతో సమీప గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరో వైపు పులిని బంధించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి: రైతుబంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష