మనుషులపై దాడి చేస్తున్న పులిని వెంటనే బంధించాలని డిమాండ్ చేస్తూ కుమురం భీం జిల్లా ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు పెంచికలపేట మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. చిన్న వన్యప్రాణిని చంపితే కేసులు పెట్టే అధికారులు.. మనుషులను హతమారుస్తున్న పులి విషయంలో మాత్రం ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా సాధు జంతువుల మాదిరిగా మనుషుల ప్రాణానికి వెల కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీలు, గిరిజనులను అడవులకు దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆదివాసీలు అన్నారు. పులిని సంరక్షించాలనే నెపంతో పోడు వ్యవసాయానికి గిరిజనులను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పులి దాడిలో మృతి చెందిన వారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: హిందూ ఆలయం కోసం ముస్లిం భూదానం