Khammam ACP clarity on illegal cases: పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఖమ్మంలో కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారని ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. అక్రమ కేసులు పెట్టారనటంలో వాస్తవం లేదని.. భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులంటూ వస్తున్న ఆరోపణలనుద్దేశించి స్పష్టతనిచ్చారు. తీవ్ర నేరాలు ఉన్నవారిపై కచ్చితంగా రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ.. పలు వివరాలు వెల్లడించారు.
అసత్య ఆరోపణలతో పక్కదారి పట్టిస్తున్నారని... వారిపై 20 సంవత్సరాల క్రితమే కేసులు ఉన్నాయని ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. రెండ్రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన భాజపా కార్యకర్త సాయి గణేశ్‌పై కేవలం ఆరు కేసులు ఉన్నాయని.. అతనిపై 2020లో రౌడీషీట్ తెరిచామని చెప్పారు. సాయి గణేశ్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందన్న ఏసీపీ... త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని వెల్లడించారు.
'అక్రమ కేసులు పెట్టారని పోలీసులపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. మహమ్మద్ ముస్తఫా అనే వ్యక్తిపై 2000 లోనే మాదకద్రవ్యాల సరఫరాలో కేసు నమోదై ఉంది. మృతుడు సాయిగణేశ్‌పై 6 కేసులున్నాయి. వాస్తవాలను దాచి మాపై కావాలనే ఆరోపణలు నెడుతున్నారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.' -ఆంజనేయులు, ఖమ్మం ఏసీపీ
భాజపా కార్యకర్త మృతితో ఉద్రిక్తత: కేసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 14న సాయిగణేశ్.. పోలీస్‌స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16న చనిపోయాడు. సాయి మృతికి అధికార పార్టీ నాయకులు, పోలీసుల వేధింపులే కారణమని భాజపా శ్రేణులు చేసిన ఆందోళన ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పాడుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు. అంతేకాకుండా పలువురు కార్యకర్తలపై రౌడీషీట్లు ఓపెన్ చేసి పదుల కొద్దీ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సాయిగణేశ్‌ను పోలీసులు, అధికార పార్టీ నేతలు తీవ్రంగా వేధించారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపించారు.
ఇవీ చదవండి: భాజపా కార్యకర్త ఆత్మహత్య.. ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు.. తెరాస వేధింపులే కారణమా.?
'పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక తెరాస దాడులు'
'సొంత ఇల్లు లేదు.. ఫ్రెండ్స్ దయతో..!'.. పేదరికంలో ప్రపంచ కుబేరుడు!!