కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నెలకొన్న అక్రమ కట్టడాలను పురపాలక అధికారులు తొలగించారు. పట్టణంలోని భగత్ సింగ్ రోడ్, ఇందిరా మార్కెట్ ప్రాంతంలో కూరగాయల, పండ్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. చిరువ్యాపారుల కోసం పురపాలక అధికారులు భవనం కేటాయించినా.. వారు రహదారులపైనే వ్యాపారం చేయడం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వాటిని తొలగించామని పురపాలక అధికారులు తెలిపారు.
ఒక్కో వ్యాపారి రహదారికి 10 ఫీట్ల వరకు ఆక్రమించి తాత్కాలిక షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న అధికారులు.. అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు. పలుమార్లు వారికి కేటాయించిన స్థలంలో వ్యాపార నిర్వహణ చేసుకోవాలని చెప్పినా.. వ్యాపారులు పట్టించుకోలేదని . అందుకే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. గురువారం ఉదయం పురపాలక కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో పుర సిబ్బంది అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పట్టణ ఎస్.ఐ. వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.