కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 8 జిన్నింగు మిల్లులు ఉండగా, ఇందులో దాదాపుగా మూడు నుంచి నాలుగు వందల మంది వలస కూలీలు పనిచేస్తున్నారు. లాక్‌డౌన్
అమలులో ఉన్నందున పూటగడవటమే కష్టంగా ఉంది. ఈ తరుణంలో నిరుపేదలు, రెక్కాడితే డొక్కాడని బీదవాళ్లు, వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే వలస కార్మికులకు కొందరు మానవతావాదులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు స్పందిస్తున్నారు.
భోజనం, వాహనం ఏర్పాటుతో పాటు, ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తనయుడు కోనేరు వంశీ, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. జడ్పీ ఛైర్మన్ కోవలక్ష్మి బిహార్ వెళుతున్న వారికి భోజనం అందించి, జిల్లా సరిహద్దు వరకు వాహనం ఏర్పాటు చేశారు. వీరితో పాటు అనేక మంది సామాన్యులు బాటసారులను ఆదుకుంటున్నారు.
పెరుగుతున్న క్వారంటైన్ కేసులు
జిల్లా కేంద్రంలోని సీహెచ్‌సీ ఐసోలేషన్ వార్డులో 22 మంది అనుమానితులు ఉన్నారు. ఇందులో నలుగురు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతుండగా, వీరందరికీ వేర్వేరు గదుల్లో ఆశ్రయం కల్పించారు. సీహెచ్‌సీలో 40 వరకు గదులు ఉండగా, కరోనా అనుమానితులు ఉంచడానికి వారికి అవసరమగు చికిత్స, భోజనం అందించడానికి ప్రత్యేక వార్డుల కోసం సీహెచ్‌సీలో సగం భవనాన్ని కేటాయించారు.
ఇందులోకి ఓపీ చూయించుకునే రోగులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గోలేటిలోని క్వారంటైన్ కేంద్రంలో ఆదివారం ముగ్గురిని తరలించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న జిల్లాల నుంచి ఇటీవలే వచ్చిన వారిని ముందు జాగ్రత్తగా ఈ కేంద్రంలో ఉంచుతున్నారు. వాంకిడి బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో 70 పడకల క్వారంటైన్ కేంద్రం ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 30 పడకలు సమకూర్చగా, రెండు రోజుల్లో మరో 40 పడకలను ఏర్పాటు చేయనున్నారు.
వాహన సదుపాయం కల్పించారు
ఆసిఫాబాద్: బిహార్‌కు కాలినడకన వెళుతున్న వలస కూలీలను తెలంగాణ సరిహద్దు దాటించేందుకు జడ్పీ ఛైర్‌పర్సన్ కోవలక్ష్మి వాహనాన్ని సమకూర్చారు. సికింద్రాబాద్ నుంచి ఆసిఫాబాద్‌కు చేరుకొని ఆమెను వేడుకోవడంతో ట్రాక్టర్‌లో వారిని పంపించారు.
కాలినడకనే.. 560 కిలోమీటర్లు
నాగ్‌పూర్‌కు చెందిన 25 మంది వలసకూలీల లాక్‌డౌన్‌తో ఇంటి బాట పట్టారు. ఆకలితో అలమటిస్తూ రైలు పట్టాల మీదుగా అయితే ఎవరూ అడ్డుకోరని సికింద్రబాద్ నుంచి బయలుదేరారు. రెబ్బెనకు చేరుకోగానే విషయం తెలుసుకున్న అన్నదమ్ములైన వ్యాపారులు సచిన్ జైశ్వాల్, సతీష్ జైశ్వాల్ వారికి భోజనం ఏర్పాటు చేశారు. పుచ్చకాయలు అందజేసి ఉపశమనం కలిగించారు.
ఇదీ చూడండి: 'అదుపులోనే ఉంది.. అయినా మరో మూడువారాలు తప్పదు'