కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వానాకాలం ప్రారంభంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. జిల్లాలోని పలు మండలాల్లో ప్రతిఏటా కోట్ల రూపాయల వ్యయంతో లక్షల మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించి మొక్కలను నాటే బాధ్యతలను అధికారులు, గ్రామ సర్పంచ్లకు అప్పగించారు.
జులై మొదటివారంలో కొద్దిపాటి చినుకులు పడడం వల్ల అధికారులు వారం రోజులుగా గ్రామాల్లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటిన మొక్కల సంరక్షణ గాలికి వదిలేయడం వల్ల... మొక్కలు నాటడం, సెల్ఫీ తీసుకోవడం వరకే... ఈ కార్యక్రమం పరిమితమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని వాంకిడి మండలంలో లక్ష్మీనగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీగార్డ్ లేకపోవడం వల్ల మేకలకు ఆహారమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో నాటిన మొక్కల్లో 50 శాతం మొక్కలు నామరూపాల్లేకుండా పోయాయి. నాటిన మొక్కలకు నీరుపోసే దిక్కు లేక చాలావరకు ఎండిపోయాయి. వాంకిడి మండలంలో లక్ష్మీ నగర్ ఆసుపత్రి ఖాళీ స్థలంలో నాటిన వివిధ రకాల మొక్కలు ఎండిపోయాయి.
రాష్ట్రాన్ని పచ్చదనంతో ఆహ్లాదకరంగా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమం కొందరి నిర్లక్ష్యం వల్ల అభాసుపాలవుతోంది. మొక్కలను సంరక్షించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి నాటిన మొక్కల్ని సంరక్షించి హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు.