ప్రభుత్వ ఆస్పత్రిలో గవర్నమెంట్ డాక్టర్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పైగా సర్కారీ దవాఖానాల్లో సుఖ ప్రసవం అయ్యేందుకు వైద్యులు కృషి చేస్తారని ఆమె తెలిపారు. ఆమే కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కొడ్మెత సువర్ణ. ఆయుర్వేదిక్‌లో ఎం.డి. పూర్తి చేసిన వైద్యురాలు... జయశంకర్ భూపాలపల్లి జిల్లా బయ్యారం కమ్యూనిటీ హెల్త్ వెల్నెస్ సెంటర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మొదటి నుంచి ఇక్కడే..
కాగజ్ నగర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే మొదటి నుంచి చెకప్ చేయించుకున్నట్లు వైద్యురాలు సువర్ణ(doctor delivery in govt hospital) తెలిపారు. డాక్టర్ల సలహాలు అన్నీ పాటించానని తెలిపారు. కాగా బుధవారం ఉదయం 4గంటలకు ఆమెకు డా.అశ్విని, రాజ్యలక్ష్మి, లవణ్యలు సాధారణ ప్రసవం చేయగా... పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణీలకు సకల వసతులు కల్పిస్తున్నారని... వైద్యుల సూచనలు పాటిస్తే సాధారణ ప్రసవం జరుగుతుందని వైద్యురాలు సువర్ణ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఉన్నతాధికారి భార్య కూడా..
ఇటీవలె ఓ ఉన్నతాధికారి భార్య కూడా సర్కార్ దవాఖానాలో ప్రసవించి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ అధికారి ఎవరో కాదు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి. ఈ దంపతులకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డ జన్మించింది. ఆస్పత్రి వైద్యులు రామకృష్ణ, భార్గవి నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో సురక్షితంగా ప్రసవం చేసిన వైద్యులను కలెక్టర్ అనుదీప్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ చేసిన ప్రయత్నం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. గతంలో ఇక్కడ ఐటీడీఏ పీవోగా చేసిన గౌతమ్ తన సతీమణిని ఇదే దవాఖానాలో పురుడు కోసం చేర్పించారు. పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందాలని కలెక్టర్ దంపతులు సూచించారు. కలెక్టర్ దంపతులకు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తెరాస హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు.
అంతకు ముందు ఖమ్మం అదనపు కలెక్టర్
ఆ మధ్య ప్రభుత్వఆసుపత్రిలోనే ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలత ప్రసవం చేయించుకున్నారు. ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్. ఈ దంపతులను రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందించారు. పేదల గుడి అయిన ప్రభుత్వ ఆస్పత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని మంత్రి అన్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత(Sneha latha mogili ias) దంపతులు ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు. ఇద్దరూ ఉన్నతాధికారులు అయినప్పటికీ సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి సేవలు పొందారు. సర్కార్ దవాఖానాలో ప్రసవించి... ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచారని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి: Collector Anudeep Wife: ఆదర్శం... సర్కారీ దవాఖానాలో కలెక్టర్ సతీమణి ప్రసవం.. మంత్రి హరీశ్ ట్వీట్