ఆసిఫాబాద్ జిల్లా తెరాస జడ్పీఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన.. మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి జైనూర్ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరఫున రాఠోడ్ హరినాయక్, భాజపా నుంచి మెస్రం చంద్రకళ, ఆనందేశ్వర్ నామపత్రాలు దాఖలు చేశారు.
నామపత్రాల ఉపసంహరణకు నేడు చివరి రోజు కావడం వల్ల అధికార పక్షం మిగిలిన అభ్యర్థుల నామపత్రాలను ఉపసంహరించేందుకు యత్నించింది. భాజపా అభ్యర్థితో నామినేషన్లను ఉపసంహరించేలా చేసినప్పటికీ... కాంగ్రెస్ అభ్యర్థి రాఠోడ్ హరినాయక్ అందుబాటులోకి రాలేదు. హరినాయక్ కుమారుడితో నామపత్రాలపై సంతకాలు చేయించి ఉపసంహరణకు యత్నించారు.
నామపత్రాల ఉపసంహరణ పత్రంపై కాంగ్రెస్ అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేశారని డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్, మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్ తనయుడు రితేశ్ రాఠోడ్ ఆరోపించారు. జైనూర్ ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో తెరాస నేతలు అక్కడికి చేరడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండగా... కాంగ్రెస్ అభ్యర్థి రాఠోడ్ హరినాయక్ వచ్చి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తెరాస నేతలు అధికారబలంతో ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
తెరాస జడ్పీఛైర్మన్ అభ్యర్థి కోవ లక్ష్మి మొదట తిర్యాణి జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవం కోసం యత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం జైనూర్ ప్రాదేశిక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు నామపత్రాలు ఉపసంహరించుకోవడం వల్ల కోవ లక్ష్మి ఎన్నిక ఏకగ్రీవానికి మార్గం సుగమమైంది. అయినప్పటికీ అనుమానాలు నెలకొన్నాయి.
ఇవీ చూడండి: అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్