CM KCR Distribution Podu Pattas in Asifabad : నేడు రాష్ట్రంలో లక్షన్నర మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ పోడు పట్టాలను కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) నియోజకవర్గంలోని ఆదివాసీలకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. వారికి పత్రాలను అందించారు. అనంతరం పోడు భూములు పొందిన ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పోడు భూముల పట్టాల పంపిణీని రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ పట్టాలను పురుషుల పేరు మీద కాకుండా.. మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం బీఆర్ఎస్ అని మరోసారి స్పష్టం చేశామని తెలిపారు. ఇప్పటివరకు ఆదివాసీల మీద ఉన్న పోడు భూముల కేసులు ఎత్తివేయాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. పోడు పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కేసులు ఉండటం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు.
"పట్టాలు మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. ఆదివాసీల మీద ఉన్న పోడు భూముల కేసులు ఎత్తివేయాలి. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇంకా కేసులు ఉండటం సరికాదు. పోడు భూములకు 3 ఫేజ్ కరెంటు ఇస్తాం. గిరివికాసం పథకం కింద బోర్లు వేసుకునే అవకాశం ఇస్తాం." - కేసీఆర్, సీఎం
CM KCR Distribution Podu Lands : రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పట్టాలు పొందిన ఆదివాసీ రైతులకు రూ.23.56 కోట్లు విలువ చేసే రైతుబంధు చెక్కులను అందించామని వివరించారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో.. పోడు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ఈ భూములకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని.. విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల్లో ఆదివాసీలు బోర్లు వేసుకునేందుకు గిరివికాసం పథకం కింద.. ప్రభుత్వం బోర్లను వేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఇంకా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అంతకు ముందు ఆసిఫాబాద్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. మహమూద్ అలీ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా పోలీస్ కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఎస్పీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి.. ప్రారంభించారు.
ఇవీ చదవండి :