కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా... పచ్చని చీర కట్టుకొని ప్రకృతి ప్రేమికులను రా రమ్మని పిలుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎటు చూసినా అందమైన వాగులు, వంకలు, సెలయేర్లతో పర్యాటకుల మదిని దోచుకుంటున్నది. అదనపు అందంగా పక్షుల కుహూ కుహూ రాగాలు, అందమైన జలపాతాలు. అంతేనా... ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో పర్యటించిన అనుభూతి కలిగిస్తోంది. ఇలాంటి ప్రాంతానికి అధికారుల ఆదరణ కరవై మసకబారిపోతోంది. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నా ఆసిఫాబాద్... తెలంగాణ కశ్మీర్‌గా ఘనతకెక్కుతుందంటున్నారు స్థానికులు.
సమతుల గుండం జలపాతం
ఆసిఫాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సమతుల గుండం ప్రాంతం ఉంది. ఆసిఫాబాద్ నుంచి బల్హాన్ పూర్ వరకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ... అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమతుల గుండంకు రోడ్డు సౌకర్యం లేనందున ఈ అందమైన జలపాతాన్ని వీక్షించేందుకు ఎవరూ రావట్లేదు. ఇక్కడ శివుడి తలలో నుంచి జాలువారుతున్న గంగమ్మ తల్లిలా గుట్ట పైనుంచి నీళ్లు కిందకు దూకుతుంటాయి. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ ప్రకృతి సోయగంపై దృష్టి సారించక పోవడం వల్ల వెలుగులోకి రావట్లేదు.
గుండాల, చింతల మాధర జలపాతాలు
తిర్యాని మండలంలో చింతల మాధర గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన అటవీ ప్రాంతంలోకి వెళితే గుండాల, చింతలమాదర జలపాతం కనిపిస్తాయి. ఈ జలపాతాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతూ... ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తాయి. మండల కేంద్రం నుంచి రోమ్పల్లి గ్రామం మీదుగా 20 కిలోమీటర్ల వరకు వెళితే దట్టమైన మంగి అటవీ ప్రాంతంలో గుండాల జలపాతం ఉంది. రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడకు పర్యాటకులు తక్కువగా వస్తుంటారు.
మిట్ట జలపాతం
లింగాపూర్ మండలంలోని పిట్ట గూడ లింగాపూర్ గ్రామాల మధ్య ఉన్న మిట్ట జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య నడుస్తూ ఈ జలపాతానికి వెళ్తారు చాలా మంది. ఇక్కడికి సెలవు రోజుల్లో అయితే చాలా ఎక్కువ మంది వస్తుంటారు. ఈ జలపాతం చుట్టూ 7 మిట్ట జలపాతాలు ఉండగా ఇందులో రెండు చూడటానికి వెళ్లొచ్చు. మిగతా ఐదు చూడటానికి వీళ్లేంకుండా గుహలు అడ్డుగా ఉన్నాయి. అక్కడకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు.
కుండాయి జలపాతం
సిర్పూర్(యు) మండలంలోని ఎత్తైన గుట్టల నుంచి జాలువారే జలపాతం ప్రకృతి రమణీయతను చాటుకుంటుంది. మండలంలోని పండిగి గ్రామపంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. జైనూరు నుంచి 16 కి.మీల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లాలంటే... మూడు కిలోమీటర్ల మేర అడవిలో నడవాల్సి ఉంటుంది. ఇక్కడ తరచుగా లఘు చిత్రాలు తీస్తుంటారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఈ జలపాతాలన్నిటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని స్థానిక ఆదివాసీలు కోరుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రకృతి ప్రేమికులు వాపోతున్నారు.
ఇవీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్‌లో ఐదో పంపు ప్రారంభం