The Forest Officials Rescued the Devotees Who Were Lost in the Forest : దేవుడి దర్శనం కోసం కాలినడకన వెళ్లి తప్పిపోతే ఎలా ఉంటుంది. అది కూడా నల్లమల అడవుల్లో. పరిస్థతి ఉహించుకుంటేనే భయం పుట్టుకొస్తుంది కదా. అలాంటి ఘటనే ఇటీవల జరిగింది. ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు దాలి తెలియక దట్టమైన అడవిలో తప్పిపోయారు. ఎటు వెళ్లాలో తెలియక బిక్కబిక్కుమంటున్న వారిని అటవీ అధికారులు కాపాడిన ఘటన ఏపీలోని యర్రగొండపాలెం మండలం నల్లమలలో బుధవారం చోటుచేసుకుంది. బాపట్ల జిల్లా రేపల్లె మండలం మండలం మంత్రిపాలెం, నిజాంపట్నానికి చెందిన మొత్తం పదిహేను మంది భక్తులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం సున్నిపెంటకు చేరుకుని అక్కడి నుంచి యర్రగొండపాలెం మండలంలోని దట్టమైన నల్లమల అడువుల్లో కొలువైన ఇష్టకామేశ్వరి దేవీని దర్శించుకోవాలి అనుకున్నారు. ఆ దారిగుండా కాలినడకన బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత ఎటు వెళ్లాలో వారికి అర్థం కాలేదు. పంతనాల పెంట ప్రాంతంలో దారి తప్పారు.
కాపాడాలంటూ ఫోన్ చేసిన భక్తులు : ఎటు వెళ్లాలో తెలియక పోవడంతో అడవిలో ఉన్న ఓ సెల్‌ఫోన్ టవర్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి 100కు ఫోన్ చేసి తాము అడవిలో తప్పిపోయామని కాపాడాలంటూ అభ్యర్థించారు. సమాచారం అందుకున్న స్థానిక అటవీ, పోలీసు అధికారులు వెతకడం మొదలు పెట్టారు. ఎఫ్‌డీవో మదన్ నేతృత్వంలో ట్రాకింగ్ ఫోర్స్‌కు చెందిన హరీశ్, రామయ్య తదితర సిబ్బంది అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులు తెలిపిన ఆనవాళ్ల ఆధారంగా ఎక్కడున్నదీ గుర్తించారు. అనంతరం వారిని అడవి నుంచి సురక్షితంగా తీసుకొచ్చినట్లు అటవీ శాఖ నెక్కంటి రేంజర్ అరీఫ్ చెప్పారు.