ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా కొనసాగించాలని ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి క్రాస్ రోడ్డులోని సీహెచ్‌సీలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జడ్పీ ఛైర్ పర్సన్, ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య మొక్కలు నాటారు. సింగరేణి యాజమాన్యం ఏటా లక్షల సంఖ్యలో మొక్కలు నాటేందుకు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. నాటిన మొక్కలను సంరక్షించుకోవడంలో సంస్థ ముందుందని పేర్కొన్నారు. పండ్ల మొక్కలను రెబ్బెన, తిర్యాని మండలాల ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు.
బెల్లంపల్లి ఏరియాలో ఏటా లక్షల్లో మొక్కలు నాటుతున్నామని సింగరేణి జీఎం కొండయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది డంపింగ్ యార్డులు, ఓసీపీల్లో సుమారు 110 హెక్టార్లలో రెండు లక్షల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, సర్పంచులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'