కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ బల్దియా అధికారులు ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. వార్డుల పునర్విభజనను పరిగణలోకి తీసుకుని వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. ఈనెల 30న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.
వచ్చేనెల 22న పురపాలక ఎన్నికలు జరగనున్నందున కులాల గణన, ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. ఆ జాబితా ఆధారంగానే వార్డులోని కులాల ఓట్లను పరిగణనలోకి తీసుకొని వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు.
రిజర్వేషన్ల ప్రకటన తర్వాత అభ్యర్థులను ప్రకటించేందుకు ఆయా పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి.