పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఆ ఊరి యువకులు అండగా నిలిచారు. తోచినంత సహాయం చేసి పెళ్లికి పెద్దలయ్యారు. కుమురం భీం జిల్లా సిర్పూర్ టీ మండలం భూపాలపట్నంకి చెందిన జాలరి బక్కన్న-కళావతిలది నిరుపేద కుటుంబం. ఆయన పశువుల కాపరిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కుమార్తె మౌనిక చదువు మానేసి తల్లి దండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటుంది. కుమారుడు చదువుకుంటున్నాడు. కుమార్తెకు తాజాగా మహారాష్ట్రలోని అహేరీ మండలానికి చెందిన ఆనంద్ రావుతో పెళ్లి సంబంధం కుదిరింది. కానీ చేతిలో డబ్బులు లేవని సతమతమవుతున్నతరుణంలో… ఆ ఊరిలోని యువశక్తి సేవా సంస్థ సభ్యులు మేమున్నాం అంటూ ముందుకొచ్చారు.
యువశక్తి సభ్యులు భాస్కర్, లక్ష్మయ్య, సంతోష్, ప్రభాకర్, రమేష్‌లు గ్రూపుగా ఏర్పడి తమ వంతు సాయంతోపాటు ఇతరుల సాయం కూడా తీసుకున్నారు. మొత్తంగా 70 వేల రూపాయలు జమచేసి పెళ్లి ఖర్చులకు ఇచ్చారు. నిరుపేద యువతి వివాహానికి మంచి మనసుతో ఆర్థిక సహాయం చేసిన యువతను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు.
ఇదీ చూడండి: ఆగని ఆఖరి దోపిడీ కథనంపై హెచ్ఛార్సీ స్పందన