ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన గుమ్మడిదల శివ, నవలోక దంపతుల కుమారుడు గౌరీ శంకర్. చిన్ననాటి నుంచి చిత్రకళపై మక్కువ పెంచుకున్నాడు. పాఠశాల స్థాయిలోనే అనేత చిత్రాలు గీసి బహుమతులు అందుకున్నాడు. పేపర్ మీద పెన్సిల్‌తో వేసే చిత్రాలు అతనికి సంతృప్తినివ్వలేదు. అందరిలో ఒకడిలా కాకుండా... తనకంటూ ఒక గుర్తింపు రావాలనే లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నాడు. చైనాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ చిన్చాన్ను ఆదర్శంగా తీసుకుని మొదటి చాక్ పీస్‌లపై చిత్రాలు చెక్కడం ప్రారంభించాడు. అనంతరం ఎంతో కష్టతరమైన పెన్సిల్ మొనపై సున్నితమైన చిత్రాలు రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు.
సూర్యకాంతి వెలుగులో...
సాధారణంగా మైక్రో ఆర్ట్ చేసేవారు ప్రత్యేకంగా మైక్రో లెన్స్‌ను ఉపయోగిస్తారు. గౌరీ శంకర్ దీనికి భిన్నంగా సూర్యకాంతి వెలుగులోనే చిత్రాలను చేస్తాడు. ఇలా కేవలం రెండు మూడు గంటల్లోనే పెన్సిల్‌పై చిత్రాలను పూర్తి చేయడం మరో విశేషం. ఈ మైక్రో ఆర్టిస్ట్ సృజనాత్మకతతో చేసే బొమ్మలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.
సాధించిన విజయాలు...
గౌరీ శంకర్ ఇప్పటివరకు పెన్సిల్‌పై చిత్రాలు చెక్కి... అనేక రికార్డులను సొంతం చేసుకున్నాడు. తెలంగాణ అనే పదాన్ని 15 భాషల్లో చెక్కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్ బషీర్ పెన్సిల్ మొనపై 50 లింకులతో గొలుసు తయారు చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సాధించగా... గౌరీశంకర్ 54 లింకులతో గొలుసు తయారుచేశాడు. దీనిని గిన్నిస్ బుక్‌లో రికార్డు కోసం దరఖాస్తు చేయగా అక్టోబర్ 2న తన ఆర్ట్ పరిశీలించేందుకు వారు అవకాశం కల్పించారు.
ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు ఈ మైక్రో ఆర్టిస్ట్. పేద కుటుంబంలో పుట్టి పెన్సిల్‌పై చిత్రాలు చెక్కడంలో చక్కటి ప్రతిభ కనబరుస్తున్న గౌరీ శంకర్ ఆశయం నెరవేరాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి : కోలాటం: ఆహ్లాదం.. ఆధ్యాత్మిక అనుభూతి..