ఆ సర్కారు బడి పిల్లల్లేక మూసేసే దశకు చేరుకుంది. ప్రైవేటు పాఠశాలల దెబ్బకు కుదేలై తాళం వేసే పరిస్థితికొచ్చింది. ఈ సమయంలో వచ్చిన ప్రధానోపాధ్యాయుడు ఆ బడి దశనే మార్చేశాడు. ఒకప్పుడు పిల్లలు లేక వెలవెలబోయిన స్కూలు ప్రస్తుతం పచ్చదనంతో, సకల సౌకర్యాలతో.. విద్యార్థులతో కళకళలాడుతోంది. ఎన్నో పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది ఖమ్మం జిల్లా వేంసూరు మండలం శంభునిగూడెం పాఠశాల.
నమ్మకం కలిగించారు
గతేడాది ఈ పాఠశాలలో 35 మంది విద్యార్థులుండేవారు. పాఠశాలలో కనీస వసతుల్లేక తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు బడులకే పంపేవారు. ఈ సమయంలో బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, మరో ఉపాధ్యాయుడు స్కూలుని బతికించుకునే బాధ్యత ఎత్తుకున్నారు. గ్రామస్థులతో మమేకమై స్కూలు అభివృద్ధిపై చర్చించారు. సర్కారు బడిపై నమ్మకం కలిగించారు. ప్రభుత్వ బడి వల్ల లాభాలు వివరించారు. వారి మాటలను నమ్మిన ప్రజల సహకారంతో ఆ బడిని బతికించారు.
30 నుంచి 80కి పెరిగారు
ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 80కి చేరింది. గ్రామస్థుల సహకారంతో అనేక వసతులు వచ్చాయి. పాఠశాలలో మొక్కలు పెంచుతూ ఆహ్లదకరంగా తయారు చేశారు. కంప్యూటర్లు బాగు చేయించి డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది ఉపాధ్యాయులు అవసరం కాగా ఇద్దరే రెగ్యులర్ ఉపాధ్యాయులున్నారు. వాలంటీర్లతో నెట్టుకొట్టుస్తున్నారు. పాఠశాల ప్రగతిని గుర్తించైనా అధికారులు తగినంతమంది ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఈ సర్కారు బడికి నో-అడ్మిషన్ బోర్డు పెట్టేశారు