వారిద్దరూ మానసిక స్థితి సరిగా లేక వివిధ ప్రాంతాలు తిరుగుతూ... రైళ్ల ద్వారా ఖమ్మం నగరానికి చేరుకున్న అభాగ్యులు. అందరూ ఉన్నా... విధి చేసిన గాయంతో మానసిక దివ్యాంగులుగా మారి.. రహదారుల వెంట, చెత్తకుప్పల్నే ఆవాసాలుగా మార్చుకున్న అన్నార్థులు. తమ చేష్టలు, విచిత్రమైన ఆహార్యంతో ఎదుటి వారిని భయభ్రాంతాలకు గురిచేస్తూ... దుర్భర జీవితాలను అనుభవిస్తున్న వారిని అన్నం సేవా సంస్థ అక్కున చేర్చుకుంది. కొన్నేళ్లపాటు వారి బాగోగులు చూడటమే కాకుండా మంచి మనుషులుగా తీర్చిదిద్దింది. వారి చిరునామా సేకరించి... సొంతవారి వద్దకు తీసుకెళ్లేందుకు నడుం బిగించింది.
చిరుమానా చెప్పలేని స్థితి నుంచి
అసోంలోని వోలాఘాట్ జిల్లా ఒత్తిపొరియా గ్రామానికి చెందిన చునిల్ గొగాయ్కు 45 ఏళ్లు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. ఎక్కడెక్కడో తిరిగి రైలు మార్గం ద్వారా 2017లో ఖమ్మం చేరుకున్నాడు. దుర్భర పరిస్థితుల్లో ఖమ్మం నగర వీధుల్లో తిరుగుతున్న అతనిని చూసి స్థానికులు... అన్నం సేవా సంస్థకు సమాచారం అందించారు. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు... గొగాయ్ని ఆశ్రమానికి తరలించి సపర్యలు చేశారు. చిరునామా చెప్పలేని స్థితిలో ఉన్న అతనికి వైద్యం చేయించి బాగుచేశారు. కోలుకున్న బాధితుడు ఆశ్రమంలోనే వంటలు చేస్తూ ఉండేవాడు. దాదాపు 4 ఏళ్ల తర్వాత గొగాయ్ చెప్పిన వివరాల ఆధారంగా... అసోంకి చెందిన వాసిగా గుర్తించారు. గుహటి ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇల్లెందు వాసి నందకిశోర్ ద్వారా... గొగాయ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దొంగ అనుకున్నారు..
జార్ఖండ్ రాష్ట్రంలోని షిండేగా జిల్లా ఛాతాకౌర్కు చెందిన మర్కస్ ఖుజూర్ 2019లో కూసుమంచి మండల కేంద్రంలో మతిస్థితిమితం లేకుండా తిరిగే వాడు. అదే సమయంలో మర్కస్ను స్థానికులు దొంగగా అనుమానించి తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు అతనిని రక్షించి అన్నం సేవా ఫౌండేషన్‌కు అప్పగించారు. అప్పటి నుంచి అక్కడే ఉండేవాడు. మర్కస్ చెప్పిన కొన్ని వివరాలతో సామాజిక మాధ్యమాల ద్వారా జార్ఖండ్ వాసిగా గుర్తించారు. ఇలా లభించిన ఆధారాలతో ఇద్దరిని.. వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చేదిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇంతకాలం తమతో కలిసి ఉన్న ఇద్దరు మిత్రులు విడిపోతుండటంతో ఆశ్రమంలోని వారు ఉద్విగ్నభరితమయ్యారు. చెమ్మగిల్లిన కళ్లతో వారికి వీడ్కోలు పలికారు. సంస్థ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు వారికి చిరు సత్కారం చేసి... ఆశ్రమం తరఫున దాతల సాయంతో చునిల్ గొగాయ్కి రూ.50 వేలు, మర్కస్‌కు రూ.25 వేలు... చెరో 50 కిలోల బియ్యం అందించారు. బాధితులను స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక వాహనంలో బయలుదేరినట్లు శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: లేడనుకున్నారు.. రాడనుకున్నారు.. 40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిశాడు!