కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో రైతు పోరుగర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు . రైతులకు హక్కులు కల్పించేలా వ్యవసాయ చట్టాలు ఉండాలని... ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు ఉండాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులకు వ్యవసాయ రంగంపై అవగాహన లేదని... పూర్వం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారే ప్రభుత్వంలో ఉండేవారని అన్నారు.
నేడు వ్యవసాయ భూములు కేవలం సెలవు రోజుల్లో విడిదిగా ఉండే ఫామ్ హౌస్లుగా మారాయని ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలతో పాటు విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేలా ఉన్నాయన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మొదలైన రైతు ఉద్యమం అన్ని సంఘాలను కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా మద్దతు తెలపడం దురదృష్టకరమన్నారు.
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల్లో సుమారు డెబ్బైమందికి పైగా మరణించారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఏఐకేఎమ్ఎస్ జిల్లా కార్యదర్శి ఆవుల వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి పొట్లపల్లి శ్రీశైలం, కె. అర్జున్ రావు, ఎస్.కె ఖాసీం, పాశం అప్పారావు, కొల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: గణతంత్ర వేడుకల్లో... మన పొదుపు లక్ష్మి!