ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో ఇద్దరు మహిళా రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం వల్ల మనస్తాపంతో తాటి లక్ష్మి, కొనకంచి పుల్లమ్మ అనే ఇద్దరు మహిళా రైతులు పురుగుల మందు తాగారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
మంచుకొండ గ్రామానికి చెందిన మహిళల కుటుంబాలకు సర్వే నంబరు 123లో మూడున్నర ఏకరాల భూమి ఉంది. ఇటీవల అదే సర్వే నంబరులో ఒక స్థిరాస్తి వ్యాపారి 9 ఎకరాలు కొన్నాడు. అయితే పక్కనే ఉన్న సదరు మహిళలకు చెందిన భూములకు హద్దులు మార్చి ఆక్రమించేందుకు యత్నించాడు. దీనివల్ల గత మూడు నెలల నుంచి వివాదం పంచాయతీలో నడుస్తుంది.
ఈరోజు భూమికి కంచె వేసేందుకు యత్నించటంతో మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనతో మనస్తాపానికి గురై మహిళా రైతులు పురుగుల మందు తాగారు. అక్కడ ఉన్న వారు వెంటనే వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటం వల్ల బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: రైతులను ఆర్ధికంగా బలపరిచేందుకే ప్రభుత్వ ప్రోత్సాహకాలు