National Leaders Speech at Khammam Sabha: ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభకు హాజరైన దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్ , యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఇతర జాతీయ నేతలు కేంద్రప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. కేసీఆర్, భగవంత్ సింగ్ మాన్ మినహా మిగిలినవారు కాంగ్రెస్ గురించి ఏమీ ప్రస్తావించకుండా పూర్తిగా భాజపాపైనే విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ తన ప్రసంగంలో ఒకసారి.. కాంగ్రెస్-భాజపా దొందూ దొందే అని పేర్కొనగా, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భాజపా వ్యతిరేక పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. దాదాపుగా ఇది కాంగ్రెసేతర విపక్షాల సభగా, దేశంలో మొదటి భారీ కార్యక్రమంగా నిలిచింది. బహిరంగసభలో మొదట మాట్లాడిన కేరళ ముఖ్యమంత్రి విజయన్ భాజపా వ్యతిరేక పోరాటంలో భావసారూప్యం కలిగిన పార్టీలు ఇలా కలవడం ప్రజల భవిష్యత్తుకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
'దేశంలో సమాఖ్య వ్యవస్థను కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. రాజ్యాంగంలో నైతిక విలువలు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించి... రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ కూలదోస్తోంది. అనైతిక పద్ధతుల్లో ఆయా చోట్ల ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది. మన మాతృభాష.. మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం. హిందీ భాషను బలవంతంగా రుద్దడం ద్వారా మన మాతృభాషను దూరం చేస్తోంది. ఇది మన దేశ సమగ్రతకు పెను ముప్పు. చివరకు మన న్యాయవ్యవస్థ స్వతంత్ర్యపైనా దాడి చేస్తోంది.'-పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి
దేశంలో అన్నివర్గాల ప్రజలను భాజపా వంచించిందని భగవంత్‌మాన్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించిన కేజ్రీవాల్... భాజపాపై ఐక్యంగా పోరాటాం చేస్తామని చెప్పారు.
'దేశంలో ధరల పెరుగుదల కారణంగా సామన్యులు కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. పిల్లలను పోషించుకోవడం కష్టంగా మారింది. కానీ దేశ ప్రధానమంత్రికి ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలపై ఎలాంటి చింతా లేదు. ఆయన ఎప్పుడూ. ఏ పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయాలి, ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మాత్రమే ఆలోచిస్తారు. ఈ తరహా వైఖరితో దేశం ముందుకెళ్లదు.ప్రజలు వారికి వరుసగా రెండుసార్లు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ఇప్పుడు దేశం మార్పు కోరుకుంటోంది. వీరు దేశాన్ని మార్చడానికి రాలేదని, దేశాన్ని నాశనం చేయడానికి వచ్చారని ప్రజలకు అర్థమైంది. 2024 ఎన్నికలు ప్రజలకు ఓ మంచి అవకాశం. ప్రజలంతా కలిసి వీరిని గద్దె దించాలి. దేశం గురించి ఆలోచించే వారిని అధికారంలోకి తీసుకురావాలి.'-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్.. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని మండిపడిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా... గవర్నర్ల వ్యవస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని ఓడించడమే అందరి కర్తవ్యమని కలిసిరావాలని పిలుపునిచ్చారు.
'భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్తంగా చేస్తున్న దాడులతో భారత గణతంత్ర వ్యవస్థ ప్రమాదంలో పడింది. దేశంలో రాజ్యాంగాన్నిప్రజాస్వామ్య పాలనను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అని మోదీ చెప్పారు. కానీ ఆయన మనతో లేరు. ఆయన అదానీ, అంబానీ, టాటా, బిర్లాల పక్కన నిలబడ్డారు. దేశంలో గవర్నర్లను ఎలా ఉపయోగిస్తున్నారో చూస్తున్నాం. తెలంగాణలో గవర్నర్ ఎన్నికైన ముఖ్యమంత్రితో గొడవ పడుతున్నారు. దిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్.. అక్కడి సీఎంతో ఘర్షణకు దిగుతున్నారు. తమిళనాడు, కేరళలోనూ ఇదే తంతు. ఎందుకు ఇలా జరుగుతోందంటే భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లకు దేశ సమాఖ్య వ్యవస్థలపై విశ్వాసం లేదు.'-డి. రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అఖిలేశ్ యాదవ్ ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు సహా భాజపా ఇచ్చిన హామీల సంగతి ఏమైందన్న అఖిలేశ్... వచ్చే ఎన్నికల్లో భాజపా గద్దె దిగటం ఖాయమన్నారు.
'మీ రాష్ట్రంలో (తెలంగాణ) ఎన్నో పథకాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పంటపొలాలు, ఇళ్లకు పుష్కలంగా నీళ్లు వచ్చేలా చర్యలు చేపట్టారు. వాటిని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది.ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే అక్కడ వెనక్కులాగేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తోంది అందుకే దేశంలో ప్రగతిశీల ప్రభుత్వాలు, ప్రగతిశీల నాయకుల అవసరం ఉంది. ఇక్కడున్న నాయకులతోపాటు చాలా రాష్ట్రాల్లో ఉన్నవారంతా కలిసి పనిచేస్తాం. సమీప భవిష్యత్‌లో దేశంలో మార్పు వస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. భాజపా నేతలు ఇంటికి వెళ్తరు.'-అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు
నేతలంతా తెలంగాణలో భారాస పాలనపై ప్రశంసలు కురిపించారు. రైతుబంధు, దళిత బంధుతోపాటు భవిష్యత్ లో మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని దిల్లీలోనూ అమలు చేస్తామని కేజ్రీవాల్ చెప్పగా, పంజాబ్‌లోనూ తెలంగాణ తరహా కార్యక్రమాలు చేపడతామని భగవంత్ మాన్ తెలిపారు.
ఇవీ చదవండి: