Ponguleti Srinivas reddy controversy : రాష్ట్రంలో అధికార పార్టీకి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య అంతరం మరింత పెరుగుతోంది. ఇప్పటికే సొంతపార్టీపై ఇప్పటివరకు పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టిన మాజీ ఎంపీ.. ఒక అడుగు ముందుకేసి ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లే కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలను కలిసేందుకు ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టారు.
BRS Reaction to Ponguleti Action : ఇందులో భాగంగా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో సొంత పార్టీపై వాగ్బాణాలు సంధించారు. పార్టీ పేరు, అధినేత పేరు ప్రస్తావించకుండానే అసమ్మతి గళం వినిపించారు. కేసీఆర్ పిలుపుతో పార్టీలో చేరినా తనకు ఏ గౌరవం దక్కిందో కార్యకర్తలకు తెలుసని వ్యాఖ్యానించారు. కచ్చితంగా రాజకీయం చేసి తీరతానంటూ ప్రకటించడమే కాకుండా ప్రజల ఆశీర్వాదం కోసం ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్తానంటూ తెలిపారు.
భద్రత తొలగించడం, ఎవరు వెళ్లినా ఫర్వాలేదంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి ఒకింత గట్టిగానే స్పందించారు. జనవరి 1నుంచి జరుగుతున్న పరిణామాలు, మాజీ ఎంపీ పొంగులేటి తీరు, రాజకీయ ప్రకటనలపై బీఆర్ఎస్ అధిష్ఠానం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలిసింది. పార్టీ పేరు ప్రస్తావించకుండానే తిరుగుబావుటా ఎగురవేస్తుండటం, పార్టీ గీత దాటి వ్యాఖ్యాలు చేస్తుండటం, ఫ్లెక్సీల్లో పార్టీ అధినేత ఫోటోలు లేకుండానే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండటంపై అధిష్ఠానం సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దేశ రాజకీయ యవనికపై సత్తా చాటేందుకు, ఈ నెల 18న ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్న వేళ పొంగులేటి వ్యవహార శైలి, తాజా రాజకీయ పరిణామాలను బీఆర్ఎస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై బీఆర్ఎస్ అధిష్ఠానం పూర్థిస్థాయిలో దృష్టి సారించింది. మాజీ ఎంపీ పొంగులేటితో పార్టీ నేతలు ఎవ్వరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇందుకోసం ఉభయ జిల్లాల వారీగా పలువురు ముఖ్య నేతలను అధిష్ఠానం రంగంలోకి దించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజవర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి, ప్రస్తుతం కీలకమైన ప్రభుత్వ పదవిలో ఉన్న ముఖ్య నాయకుడితో గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మంతనాలు సాగించినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చించారు. పార్టీ ఇచ్చిన గౌరవం గుర్తుంచుకుని, తిరుగుబావుటా ఎగురవేసిన నాయకులతో వెళ్లొద్దని సూచించినట్లు తెలిసింది.
ఇవీ చదవండి: