Road Accident In Khammam : రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డుపైకి రావాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. మృత్యువు ఏ వైపుగా వచ్చి కబళిస్తుందోనని హడలిపోతున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొణిజర్ల నుంచి వైరా వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకాని మండలం ప్రొద్దుటూరు నుంచి వైరా వైపు వెళ్తున్న ఓ లారీ లారీ సడన్‌గా బ్రేకు వేసింది. దీన్ని గమనించి వెనక ఉన్న కారు త్వరగా అప్రమత్తమైంది. కానీ కారు వెనక ఉన్న మరో లారీ డ్రైవర్ ఈ విషయాన్ని గమనించక లారీని వేగంగా నడపడంతో ఆ లారీ కాస్త కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు.. ముందు ఉన్న లారీలోకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Various Road Accidents In Telangana : ఖమ్మం జిల్లాలోనే మరో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం వీఎమ్ బంజర్‌లో రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా ఢీకొన్న రెండు లారీల క్యాబిన్లు నుజ్జయి డ్రైవర్లు ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్లను బయటికి తీశారు. అప్పటికే ఇద్దరు డ్రైవర్లు మృతి చెందారు. ఒకరు బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర కుమార్ యాదవ్(35) కాగా మరొకరు వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పెనుబల్లి వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంతో రెండు గంటల పాటు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రహదారిపై ప్రమాదానికి గురైన లారీలను ప్రక్కకు తీయించి పోలీసులు వాహనాల రాకపోకలకు అడ్డు తొలగించారు.
Road Accident In Rangareddy District : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల్ గ్రామ శివారులో గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాలకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందుర్గు మండలం తంగళ్లపల్లి నుంచి మక్తమాదారానికి గడ్డిలోడు తీసుకెళ్తున్న ట్రాక్టర్ అల్వాల్ సమీపంలోని కల్వర్టు మలుపు వద్ద అదుపు తప్పింది. ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న రామచంద్రయ్య, నర్సింలు కింద పడిపోయారు. వారిపై ట్రాక్టర్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. దశరథ్, కృష్ణయ్య అనే మరో ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident At Tirupati : మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో దంతాలపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన నెమ్మది వెంకటమ్మ, తన ముగ్గురు కుమారులు, పిల్లలతో కలిసి తిరుపతికి వెళ్లి కారులో వస్తున్నారు.
ఏర్పేడు మండలం మేర్లపాకచెరువు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో వెంకటమ్మ(60), అశోక్(35), మనవరాలు బాన్వితాక్షరి(6) మృతి చెందారు. ముగ్గురు మృతితో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. వారి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంబాబు, వెంకన్న అన్నదమ్ములు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.