Political Heat in Khammam : పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తూ ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ ఇటీవల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం వచ్చే వారం నుంచి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఉభయ జిల్లాల్లోని అధికార పార్టీ నేతల మధ్య సాగుతున్న ప్రచ్చన్నయుద్ధం.. ఆ పార్టీకి తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.
పాలేరులో నేతల మధ్య వర్గపోరు : నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలంటూ అధినాయకత్వం ఆదేశాలు ఇస్తున్నప్పటికీ చాలా నియోజకవర్గాల్లో నాయకులంతా ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం కుమ్ములాటలకు కేంద్రంగా బీఆర్‌ఎస్ రాజకీయాలు సాగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. పాలేరులో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మధ్య టికెట్ వార్ నడుస్తోంది. 2018 ఎన్నికల్లో తుమ్మలపై గెలుపొందిన కందాల.. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీలో వర్గపోరుకు తావిచ్చింది. ఇరువురు నేతలు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మళ్లీ టికెట్ తనకే వస్తుందంటూ కందాల ప్రజల్లోకి వెళ్తున్నారు. అభివృద్ధి మంత్రమే తనకు టికెట్ వచ్చేలా చేస్తుందన్న ధీమాతో తుమ్మల ఉన్నారు. పార్టీ అధినేత ఎవరివైపు మొగ్గుచూపుతారో ఇప్పుడే తెలియనప్పటికీ.. పాలేరులో బీఆర్‌ఎస్ శ్రేణులు వర్గాలుగా విడిపోయి తమ నేతకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి.
వైరా నియోజకవర్గంలో త్రిముఖ పోరు : వైరా నియోజకవర్గం బీఆర్‌ఎస్‌లో త్రిముఖ పోరు రక్తికట్టిస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నికల్లో గెలిచిన రాములు నాయక్.. ఆ తర్వాత బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో అప్పటికే రెండు వర్గాలుగా ఉన్న పార్టీ కాస్తా... ఇప్పుడు మూడు వర్గాలైంది. మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోత్ చంద్రవతి.. వైరా టికెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ముగ్గురు నేతలు పార్టీ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తమనే కరుణిస్తుందని చెప్పుకుంటున్నారు.
ఆసక్తి రేపుతున్న కొత్తగూడెం టికెట్ : కొత్తగూడెంలోనూ టికెట్ రేసు ఆకస్తి రేపుతోంది. 2018 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరోసారి తనకు టికెట్ ఖాయమని భావిస్తున్నారు. అయితే.. నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఈసారి పార్టీ అధిష్టానం తనవైపు చూస్తుందని మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ధీమాతో ఉన్నారు. ఇక్కడి నుంచే గులాబీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వైద్యారోగ్య శాఖలో ఉన్నతాధికారి పార్టీ పెద్దల అండదండలు తనకు ఉన్నాయంటూ.. ఈసారి అరంగేట్రం ఖాయమని చెప్పుకుంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్‌ల పోటీ ఈ స్థాయిలో లేనప్పటికీ.. అసంతృప్తులు, అసమ్మతుల తలనొప్పులు తప్పడం లేదు.
కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలతో ఉన్న ముఖ్య నాయకుల్లో కొంతమంది బీఆర్‌ఎస్ అసంతృప్త నేత పొంగులేటి గూటికి చేరగా.. ఉన్నవారిలోనూ అలక పాన్పులు కొనసాగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సరికొత్త రాజకీయాలకు వేదిక కానున్నాయి. ఆత్మీయ సమావేశాల వేదికగా నేతల మధ్య వర్గపోరు బట్టబయలవుతుందా.. లేక పార్టీ పెద్దల జోక్యంతో జిల్లాకు నియమించిన సమన్వయకర్తలు బీఆర్‌ఎస్ రాజకీయాలను గాడిన పెడతారా లేదా అన్నది ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలో ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి: