ఖమ్మం జిల్లాలో ఎవరికైన కరోనా లక్షణాలు ఉంటే వెంటనే డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకురావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఖమ్మం గ్రామీణ మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడం వల్ల జిల్లాలోని పరిస్థితులపై కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, ఇతర వైద్యాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాజిటివ్ కేసు నమోదైన గ్రామాన్ని పూర్తిగా లాక్డౌన్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు... ఎవరిని కలిశారు అన్న వివరాలు అధికారులు సేకరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 45 మందిని క్వారంటైన్‌కు తరలించినట్లు చెప్పారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
లాక్డౌన్ మొదలైన తర్వాత జిల్లాలో తొలి కేసు నమోదైనప్పటికీ.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సేఫ్‌గా ఉందని... ప్రజలంతా చైతన్యంతో ఉండి కరోనాను ఎదుర్కోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దని స్వీయ నియంత్రణ పాటించి ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలని సీపీని ఆదేశించినట్లు అజయ్ కుమార్ వెల్లడించారు.