Paddy procurement in Khammam: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఖమ్మం జిల్లాలో 15రోజుల క్రితం 180 కేంద్రాలు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 5000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 16 కేంద్రాల్లో 1125 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించే ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.
Paddy procurement Problems in Telangana : ఖమ్మం జిల్లాలోని మిల్లులకు ఇప్పటి వరకు 2100 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించగా... భద్రాద్రి జిల్లాలో 900 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించారు. నిల్వ చేసుకోవడానికి స్థలం లేదంటూ.. వడ్లు తీసుకోవడానికి మిల్లర్లు కొర్రీలు పెట్టారు. అధికారుల చొరవతో రెండు జిల్లాల్లో కలిపి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకునేందుకు అంగీకరించారు. రైతులు కొంతమేర ఆనందపడ్డారు. ఇంతలోపే మిల్లర్ల తరుగు పేరిట దందాకు తెరలేపడంతో విలవిల్లాడుతున్నారు.
అంగీకరించాల్సిన దుస్థితి నెలకొంది: వాస్తవానికి ధాన్యం 41 కిలోలు ఉంటే 40 కిలోలకు డబ్బులు రైతుల ఖాతాల్లో పడాలి. కిలో తరుగు కింద పోతుంది. క్వింటా ధాన్యంలో ఏకంగా 5 నుంచి 7 కిలోల మేర తరుగు తీస్తున్నారు. కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలే బేరాల అడ్డాగా మారుతుండగా.. మరికొన్ని చోట్ల మిల్లుల వద్దకు లారీలు వెళ్లిన తర్వాత తరుగు తప్పదని చెబుతున్నారు. చేసేదేమీ లేక అన్నదాతలు అంగీకరించాల్సిన దుస్థితి నెలకొంది.
అకాల వర్షాలు, టార్పాలిన్ల కొరతతో తరుగు తీసినా.. ధాన్యం విక్రయించేందుకే రైతులు మొగ్గుచూపుతున్నారు. కొందరు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి.. తక్కువ ధరకే వడ్లు అమ్ముకుంటున్నారు. క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తే తమకు ఏమీ మిగలదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే చోరవ చూపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
"గత వారం రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఒక కిలో తరుగు కింద ఒప్పుకొని ఇప్పుడు మిల్లర్లు క్వింటాకు నాలుగు నుంచి అయిదు కిలోల ధాన్యం ఇస్తారా అని అడుగుతున్నారు. అలాగైతేనే ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. క్వింటాకు 7 కిలోల తరుగు తీస్తే మాకేం మిగలదు. ప్రభుత్వమే చొరవ చూపి మాకు న్యాయం చేయాలి." - రైతులు
ఇవీ చదవండి: farmers loss: అకాల వర్షాలు.. అన్నదాతకు తీరని కష్టాలు
Gangula Kamalakar: 'రెండున్నర రెట్లు అధికంగా ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు'
కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎంపై రాళ్ల దాడి.. తలకు గాయం.. పది రోజుల్లోనే రెండోసారి!