వారు రెక్కాడితే గానీ డొక్కాడని బాధితులు కాదు. అసలు రెక్కలే ఆడని విధివంచితులు. భర్తకు అనారోగ్యం, భార్యకు కాళ్లు చచ్చుబడిపోయి ఇద్దరూ కటిక దరిద్రంలో(Old couple Tragic story) మగ్గుతున్నారు. చేతికందిన కొడుకు అంతో ఇంతో తెచ్చి పెడుతుంటే తిని బతుకీడుస్తుంటే.. విధి ఆ విధంగానూ ఆ దంపతులపై చిన్నచూపే చూసింది. అనారోగ్యంతో కొడుకు మృత్యువాతపడటంతో... ఆ వృద్ధ దంపతుల బతుకు దయనీయమైంది. చేతిలో చిల్లిగవ్వ లేక, ఒక్కపూట తిండికే నోచుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు.
కనురెప్పల మాటున కన్నీటి గాథ
ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్ కాలనీకి చెందిన మారెముత్తు, భాగ్యలక్ష్మీ(Old couple Tragic story) దంపతులు. పేరులో అదృష్టం ఉట్టిపడుతున్నా.. బతుకులో మాత్రం పూట తిండి దొరికితే మహాభాగ్యం అనే పరిస్థితి ఏర్పడింది. పదేళ్ల క్రితం అనారోగ్యానికి గురైన మారెముత్తు పనిచేయలేని స్థితికి చేరుకున్నారు. భార్య ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. చివరకు ఆమె రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. కొడుకు ఉన్నన్ని రోజులు అతని సంపాదనతో రోజులు గడిచాయి. ఖమ్మం రైల్వే స్టేషన్లో బిస్కెట్లు అమ్ముతూ తల్లిదండ్రులను పోషించాడు. కొన్నిరోజుల పాటు ఇలా కాలం గడిచినా... విధి ఈ కుటుంబాన్ని(Old couple Tragic story) మరోసారి వెక్కిరించింది. నాలుగేళ్ల క్రితం అనారోగ్యం బారినపడి కుమారుడు మృత్యువాతపడటంతో... వృద్ధ దంపతులు కష్టాలు, కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు. తమకొచ్చిన కష్టాన్ని తలుచుకుని వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మాకు ముందువెనకా ఎవరూ లేరు. పింఛనుకు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకూ మాకు ప్రభుత్వ సాయం రాలేదు. ఉన్న ఒక్క కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. మా ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో ఆదుకునే దిక్కు లేక నరకయాతన అనుభవిస్తున్నాం. ఊళ్లో వాళ్లు పెట్టే అన్నం తిని కడుపు నింపుకుంటున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. -వృద్ధ దంపతులు
మరింత క్షీణించి
పూట గడుపుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక, ఆస్తిపాస్తులు లేక వృద్ధ దంపతులు కష్టాలు(Old couple Tragic story) పడుతున్నారు. నాలుగేళ్లుగా వారి దయనీయ పరిస్థితి చూసి గ్రామస్థులు తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఫించన్ కోసం దరఖాస్తు చేశామని సర్పంచ్ లలిత తెలిపారు. బలవర్దకమైన ఆహారం లేక వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. పోనీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటే.. ఆధార్, రేషన్ కార్డు ఉన్నా ఆసరా పింఛను అందక అవస్థలు పడుతున్నారు.
ఈ వృద్ధ దంపతులు మాకు పదేళ్లుగా తెలుసు. వాళ్లకు నా అంటూ ఎవరూ లేరు. వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మాకు తోచినంత సాయం చేస్తున్నాం. పింఛను దరఖాస్తు ఆన్లైన్ కావడంతో కొంత సమయం పట్టేలా ఉంది. త్వరలోనే వారికి పింఛను అందుతుంది. -లలిత, సర్పంచ్
ఆదుకునే వారు లేక దినదినగండంగా గడుపుతున్నారు. తమ దయనీయతను చూసి ప్రభుత్వం, దయాద్రహృదయులు ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Farmers protests for Tokens: తీరని టోకెన్ వెతలు.. ఓ వైపు వరుణుడి భయం.. మరో వైపు అధికారుల నిర్లక్ష్యం