ఈ ఏడాది సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసిన ప్రభుత్వం.. డిసెంబర్ 14న మళ్లీ ప్రక్రియను ప్రారంభించింది. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని భావించినా పలు అవాంతరాల నేపథ్యంలో... పాత పద్ధతిలోనే తిరిగి ప్రారంభించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 14న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా... మూడు రోజులుగా నామమాత్రంగానే సాగుతోంది. స్లాట్లు బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ల వరకు క్రయవిక్రయదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్, గ్రామీణ, కూసుమంచి, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు... భద్రాద్రి కొత్తగూడె జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, బూర్గంపాడు, భద్రాచలం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. మొత్తం 11 కార్యాలయాల్లో మూడ్రోజుల నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే తొలి రోజు ఉభయ జిల్లాల్లో ఎక్కడా స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ జరగలేదు. రెండు జిల్లాల్లో కలిపి రెండో రోజు మూడు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మూడోరోజు మొత్తం 6 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో మొత్తం 9 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా... భద్రాద్రి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మ్యుటేషన్ ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తున్నారు. తొలిరోజు అమావాస్య కావడం, రిజిస్ట్రేషన్లలో చోటుచేసుకున్న మార్పులపై క్రయవిక్రయదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొన్ని సాంకేతిక సమస్యలతోపాటు ఇతర ఇబ్బందులు తలెత్తడం వల్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. సమస్యలన్నీ సమసిపోయి త్వరలోనే పూర్తిస్థాయిలో జోరుగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉందంటున్నారు.
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు... సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని క్రయవిక్రయదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.