NGT On Sathupalli Opencast Mining: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్య విషయమై దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. సత్తుపల్లికి చెందిన బానోత్ నందూనాయక్, ఒగ్గు శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ విచారణ చేపట్టింది. మైనింగ్ పేలుళ్ల వల్ల సత్తుపల్లిలో చాలా ఇళ్లు దెబ్బతిన్నట్లు ధ్రువీకరించింది. ఎన్టీఆర్‌నగర్, వెంగళరావునగర్, విరాట్ నగర్‌లో ఇళ్లు దెబ్బతిన్నట్లు తేలింది.
అనుమతులు లేకుండా 11 ఏళ్ల పాటు మైనింగ్ ఎలా చేపట్టారని ఎన్జీటీ ప్రశ్నించింది. 11 ఏళ్ల అక్రమ మైనింగ్‌కు ఎంత జరిమానా విధించాలన్న ఎన్జీటీ... రూ.600 కోట్లు ఆర్జించిన సింగరేణిపై రూ.10 వేల జరిమానా ఏంటని నిలదీసింది. ప్రభుత్వ సంస్థ అయినందున చర్యలు తీసుకోవట్లేదని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే బాధితులకు ప్రభుత్వం ఇళ్లు కట్టించే యోచనలో ఉందని ఎన్జీటీకి తెలిపిన పిటిషనర్... త్వరతగతిన ఇళ్లు కట్టించేలా ఆదేశాలు ఇవ్వాలని... సింగరేణి జమ చేసిన రూ.160 కోట్లు ఖర్చు పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు.
అయితే రూ.26 కోట్లు బ్యాంక్ గ్యారెంటీగా ఇచ్చినట్లు సింగరేణి తెలిపింది. ఇరువురి వాదనల విన్న ఎన్జీటి చెన్నై బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చూడండి : బొగ్గు కోసం బాంబు పేలుళ్లు.. భయాందోళనలో కాలనీ ప్రజలు!