Tummala Nageswara Rao Latest News : రాబోయే ఎన్నికలకు సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో టికెట్ ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యింది బీఆర్ఎస్(BRS). మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడటంతో.. ఆయన అనుచరగణం అసమ్మతికి తెరలేపింది.
తుమ్మల బీఆర్ఎస్ను వీడి వేరే పార్టీలో జాయిన్ అవుతారేమోనని ఊహించిన బీఆర్ఎస్.. బుజ్జగింపు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంపీ నామ నాగేశ్వరరావు తుమ్మల(Tummala)తో భేటీ అయ్యారు. గంటకు పైగా ఇద్దరు చర్చించినట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అగ్రనాయకుడిగా పేరు పొందారు. 2018 ఎన్నికల్లో పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో పరాజయం మూటగట్టుకున్నారు.
Khammam Latest Political News : అనంతరం కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంతో పాటు.. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తనకే టికెట్ ఇస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ.. అనూహ్యంగా మళ్లీ కందాలకే టికెట్ కేటాయించడంతో.. తుమ్మల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
తుమ్మలకు టికెట్ రాకపోవడంతో.. పాలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, తుమ్మల అనుచరులు ఖమ్మం గ్రామీణం మండలంలోని సత్యనారాయణ పురంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గ బరిలో తుమ్మల ఉండాల్సిందేనని తీర్మానించారు. కొత్తగూడెం నుంచి ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ఆశించిన జలగం వెంకట్రావుకు సైతం.. టికెట్ దక్కకపోవడంతో.. ఆయన వర్గీయులు భవిష్యత్తు రాజకీయ పయనంపై త్వరలోనే సమావేశానికి సిద్ధమవుతున్నారు.
Tummala Latest News : ఇల్లందులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. గతంలో ప్రాతినిథ్యం వహించిన పాలేరు నియోజకవర్గ అభ్యర్థిత్వం.. తుమ్మలకు ఇవ్వకుండా అవమానించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ అనుభవంతోపాటు.. ప్రతి నియోజకవర్గంలో రహదారులు, ఆసుపత్రులు, చెరువులు చెక్ డాములు అభివృద్ధి చేసిన ఘనత తుమ్మలకే దక్కిందని పేర్కొన్నారు. అటువంటి నాయకుడిని గుర్తించకుండా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది సీట్ల ప్రకటనను తీవ్రంగా ఆక్షేపించారు. ఈనెల 25న హైదరాబాద్ నుంచి వస్తున్న తుమ్మలకు వేలాది కార్లతో స్వాగతం పలకాలని నిర్ణయించారు.