తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశం ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
గ్రామాలు అభివృద్ధి పథకాలతో కళకళలాడుతున్నాయని, నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు భవిష్యత్తులో సీతారాం ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయనున్నట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రూ.790 కోట్లు అన్నదాతలకు జమ చేశామని, పెట్టుబడి సాయంతో పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి అందిస్తూ భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు.
పల్లెలు, పట్టణాలు అభివృద్ధితో పాటు సాగునీటి వనరులు మెరుగుపరుస్తూ రాష్ట్రాన్ని రామరాజ్యంగా తీర్చిదిద్దారని.. అలాంటి ప్రభుత్వానికి ఆశీర్వాదంగా ప్రతి ఎన్నికల్లో గెలుపును కానుకగా ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు స్థానిక సంస్థలు, సహకార సంఘాలు, పురపాలకాలు ఎక్కువ స్థానాల్లో తెరాస విజయం సాధించిందని, అదే స్ఫూర్తితో రానున్న శాసనమండలి ఎన్నికల్లో గెలుపునకు తెరాస శ్రేణులు కృషి చేయాలన్నారు. మండలాల వారీగా ప్రజా ప్రతినిధులు, తెరాస కార్యకర్తలు బాధ్యతగా కష్టపడి గెలుపునకు తోడ్పడాలని సూచించారు.
మండలాల వారీగా ఇప్పటివరకు నమోదు ఓటు హక్కు నమోదు వివరాలను తెలుసుకున్నారు. సమావేశం అనంతరం నియోజకవర్గంలోని పలువురు వివిధ పార్టీల నుంచి తెరాసలో చేరారు. వారికి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాములు నాయక్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఇదీ చదవండి: 'పట్టభద్రులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి'