ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఎన్నికల్లో ప్రతి ఓటర్ను ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు గతంలో ఏర్పాటు చేసిన సభలో రాములు నాయక్ పాల్గొన్నారు. ఆ సభలో మాట్లాడే క్రమంలో... ఓటర్ల లిస్టును మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
ఇప్పటి వరకు బాగానే ఉన్నా... ఓటర్లను ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించుకోవాలనటం నుంచి అసలు కథ మొదలుపెట్టారు. అందులో తమ వర్గం ఉంటారని... వాళ్లు కాకుండా ఇతరులను సైతం తమకే ఓటు వేసేలా చేయాలన్నారు. అందుకోసం... ఖర్చులకు డబ్బులు సైతం ఇస్తామని ఇంటి గుట్టు బయటపెట్టేశారు. ఇది ఆఫ్ ద రికార్డంటూనే... బహిరంగంగా విషయం వెల్లడించేశారు. ఆ తర్వాత తడుముకుని... విన్న భయమేమీ లేదని, నవ్వుకుంటూనే... అసలు విషయాన్ని అంగట్లో పెట్టేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యారు.
జిల్లా ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు... తాము ఇస్తానన్న డబ్బులు ఓటర్లకు కాదని... పట్టభద్రుల వివరాలు సేకరించే యువకులకు పారితోషికంగా ఇస్తామన్నామని తెరాస ఓ ప్రకటన విడుదల చేసింది. తమపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.