ఎస్సీల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారి సంక్షేమం కోసమే 'దళిత సాధికారత పథకం' తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించిన మంత్రి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎస్సీల ఆత్మ బంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. సీఎం ప్రవేశపెట్టిన ఈ పథకం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే పేదల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
అంతుకు ముందు సిరిపురం గ్రామంలో జరిగిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా మంత్రి పువ్వాడ మొక్కలు నాటారు. అక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటాన్ని చూసిన మంత్రి పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంప్లాయిస్ కాలనీలో మొక్కలు నాటారు. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక సివిల్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర నాయకులు బొమ్మెర రామ్మూర్తి, ఎంపీపీ లలిత పాల్గొన్నారు.
దళిత సాధికారత కోసం, వారి జీవనోద్ధరణ కోసం ఎన్ని స్కీములు వచ్చినా దళితుల బతుకులు బాగుపడడం లేదన్నది వాస్తవం. వారి భవిష్యత్తులో పేదరికాన్ని ఈ పథకం ద్వారా రూపుమాపుతాం. ఎన్ని పథకాలు అమలవుతున్నా ఇంకా పేదరికంలో ఉన్నారు. మన ఆకాంక్షల్ని ముఖ్యమంత్రి నెరవేరుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఈ పథకం ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చి వారి జీవితాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నా. పేదరికంలో మగ్గుతున్న ఎస్సీల జీవనం మెరుగుపడడం లేదు. సీఎం కేసీఆర్ వారిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం తీసుకొచ్చారు. యువతకు, ఎస్సీల జీవన విధానం మెరుగుపడేలా ఈ పథకాన్ని తీసుకొచ్చాం. దళిత సాధికారత పథకం ద్వారా పేదరికం నుంచి విముక్తి కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. అలాగే మధిరలో అంబేడ్కర్ విగ్రహం వద్ద మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం.- పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి