ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల, సింగరాయపాలం గ్రామాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. తనికెళ్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతుల సమస్యలపై ఆరా తీశారు.
లారీలు లేకపోవడం వల్ల ఎగుమతుల్లో జాప్యం జరుగుతోందని కర్షకులు చెప్పగా.. చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల వసతులు కల్పించాలని తెలిపారు. ధాన్యం విక్రయించేటప్పుడు భౌతిక దూరం పాటించాలని మంత్రి సూచించారు.
అనంతరం సింగరాయపాలెం గ్రామానికి చేరుకుని ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహిస్తోన్న నర్సరీని పరిశీలించారు. పల్లె ప్రగతిలో సూచించిన విధంగా ప్రతి గ్రామంలో నర్సరీ నిర్వహణ నూరు శాతం ఉండాలని మంత్రి సూచించారు. కరోనా సోకకుండా ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.