ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు మామిడి కాయలు నేలరాలాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలోని లింగాల, చందుపట్ల, ఎర్ర బోయినపల్లి, పేరువంచతో పాటు పెనుబల్లి మండలం ముత్తగూడెం తదితర గ్రామాల్లో వర్షం పడి మామిడికాయలు నేలపాలయ్యాయి. దిగుబడి కోసం ఎంతో ఆశతో చూసే మామిడి రైతుల ఆశలు అడియాసలయ్యాయి.
తీవ్రంగా దెబ్బతీసింది...
నేలరాలిన మామిడి కాయలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అకాల వర్షం మామిడి రైతులను తీవ్రంగా దెబ్బతీసిందని రైతులు ఎమ్మెల్యేతో మెురపెట్టుకున్నారు. మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా కాయలు కోతకు వచ్చే సమయానికి కొంత ఇబ్బందులు పడ్డప్పటికీ... చివరకు అనుమతి తీసుకొని కాయలు కోసే సమయానికి అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసిందని వాపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి మీనాక్షి, వ్యవసాయ అధికారిణి రూప, జడ్పీటీసీ సభ్యుడు కట్ట అజయ్ కుమార్, ఎంపీపీ రఘు తదితరులు పాల్గొన్నారు.