కరోనా కట్టడికి ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు ఫలించాయి. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రీన్‌జోన్ లోకి వెళ్లగా... తాజాగా ఖమ్మం జిల్లాలోను కొత్తకేసులు నమోదు కాకపోవడం వల్ల గ్రీన్‌జోన్ లోకి రానుంది. కేంద్రం ఈ మేరకు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సడలింపులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాలతో రెండు జిల్లాల్లోనూ లాక్డౌన్ నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఆ విషయంలో తగ్గేది లేదు
సాధారణ సమయంలో ద్విచక్రవాహనంపై ఒక్కరిని, కారులో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నారు. కర్ఫ్యూ సమయాల్లో మాత్రం అనుమతి ఉన్నవారినే రోడ్లపై తిరగనిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా....వాహనాలు జప్తు చేస్తున్నారు.
నూతన జంటలపై కేసు నమోదు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి వివాహాన్ని ఎక్కువ మంది సమక్షంలో జరుపుకున్నందుకు గాను చింతకాని మండలం బస్వాపురంలో రెండు జంటలతోపాటు 16 మందిపై కేసులు నమోదు చేశారు. అశ్వారావుపేటలోని తెలంగాణ-ఏపీ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపడుతున్నారు. వలస కూలీల వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో ఇవాళ్టి నుంచి సాధారణ పనివేళలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో ఏసీ దుకాణాలు, ఆటోమోబైల్ షాపులు, విడిభాగాల దుకాణాలు తెరుచుకున్నాయి.
ఇదీ చూడండి : ముద్దు పెట్టినందుకు వెంటాడుతున్న కరోనా..!