ఖమ్మంలో ప్లాస్టిక్‌ను నిషేధించిన నగరపాలక సంస్థ... ప్లాస్టిక్ వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పర్యావరణానికి చేటు చేసే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా... జనపనార, వస్త్రం, కాగితంతో సంచుల తయారీపై దృషి పెట్టింది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి... మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు కదిలింది. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘం బృందం మహిళలకు పర్యావరణహిత సంచుల తయారీలో శిక్షణనిస్తోంది.
శిక్షణ పొందిన మహిళలు జనపనార, కాగితం, వస్త్రం, దారాలు ఉపయోగించి రోజువారీగా వాడే సంచులు తయారు చేస్తున్నారు. కాగితంతో తయారు చేసిన పూల బొకేలు, ఫైల్స్, అలంకరణకు వాడే వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. సంచులు కుట్టడంతోపాటు రసాయనాలు లేని రంగులను వాటిపై అద్దడం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని మహిళలు తెలిపారు.
శిక్షణలో భాగంగా 160 మందికి తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పటికే 60 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 డివిజన్లలో 50 యూనిట్లు ఏర్పాటు చేశారు. 12 రోజుల శిక్షణాకాలంలో సంచులు కుట్టడం, వాటిపై రంగులు దిద్దడం, అద్దాలు, పూసలతో డిజైన్లు వేయడం, అలంకరణ వస్తువులు తయారు చేయడం నేర్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. మహిళలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి... వ్యక్తిగతంగా వారు వృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నారు. తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
ఇవీ చూడండి: రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేసీఆర్