KTR Meeting on MP Elections : తెలంగాణ గళం, బలం బీఆర్ఎస్దేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు స్పష్టం చేశారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదామని, త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించుకుందామని సూచించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల, నేతల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలేదనడానికి గులాబీ పార్టీ సాధించిన ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాల్లో అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణలతో సీట్లను కోల్పోయామన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని దాన్ని సమీక్షించుకుని ముందుకు సాగుదామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పాటై నెలదాటిందని, అధికారం వచ్చిన తెల్లారే వాగ్దానాలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన దిశగా అడుగులేస్తుందని విమర్శించారు. హస్తం పార్టీ నెల రోజుల పోకడ ఎలా ఉంటుందో స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
KTR on Parliament Elections : కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించడంతో ప్రజల్లో అసహనం ప్రారంభమైందని, ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలోనే కోల్పోయే లక్షణం ఆ పార్టీ సొంతమని పేర్కొన్నారు. గత 1983లో ఎన్టీఆర్(NTR) స్థాపించిన తెదేపా, 1989లో టీడీపీని(TDP) ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్‌కు పట్టం కడితే స్వల్పకాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు.
ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయతీ చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకుండదనేది, గత నెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్‌ఎస్ పోరాడుతుందని ఆ దిశగా మనందరం కార్యోన్ముఖులం కావాల్సి ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 12సీట్లకు తగ్గొద్దన్న రేవంత్ రెడ్డి, ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనలు
పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ గురి - టికెట్ల కోసం నాయకుల మధ్య హోరాహోరీ పోటీ