ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయ పల్లికి చెందిన లింగయ్య పద్మావతి దంపతుల ముగ్గురు కుమారులలో పెద్దవాడైన రాంబాబు శ్రీశైలంలో విద్యుత్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఏడేళ్లుగా అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తూ పాల్వంచకు బదిలీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మృత్యువు కబళించిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబం నుంచి 2013లో ఉద్యోగం సంపాదించి.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న రాంబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు శ్రీశైలంలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు.
తమకు దగ్గరకు వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు... రాంబాబు ఇకలేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఉసిరికాయ పల్లి గ్రామంలో ఈ సంఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. జరిగిన ఈ ఘోర దుర్ఘటన నేపథ్యంలో పలువురు వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మృతి