Khammam Congress MLA Tickets Disputes 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ కాంగ్రెస్ ఈనెల 16న తొలి దఫాలో ప్రకటించిన అభ్యర్థుల్లో ఇద్దరు సిట్టింగులకు మాత్రమే చోటు దక్కింది. మధిర నుంచి సిట్టింగు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ ప్రకటించింది. సీనియర్ నేతలుతుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు మొదటి జాబితాలో ఉంటాయని అంతా భావించినప్పటికీ.. వీరి అభ్యర్థిత్వాలు మాత్రం ఖరారు కాలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇద్దరు నేతలు బరిలో నిలిచే స్థానాలపై స్వయంగా పార్టీ అధిష్ఠానం పెద్దలే స్పష్టత ఇచ్చారు.
Congress MLA Tickets Issue Khammam : ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలవడం ఖాయమైంది. అభ్యర్థిత్వాలు ప్రకటించకపోయినప్పటికీ ఇద్దరు నేతలు, వారి అనుచరగణమంతా నియోజకవర్గాల్లో రంగంలోకి దిగి.. ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. రెండో జాబితాలో వీరిద్దరి పేర్లు ఉంటాయన్న ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో సాగుతోంది. అంటే మొత్తం 10 స్థానాలకు 4 స్థానాల్లోనే అభ్యర్థుల టికెట్లు కొలిక్కివచ్చాయన్న మాట.
మిగిలిన 6 నియోజకవర్గాల్లో నేతల మధ్య టికెట్ల పోరు తారాస్థాయిలో ఉందన్న ప్రచారం సాగుతోంది. ఒక్కో నియోజకవర్గంలో దాదాపు ముగ్గురికి తగ్గకుండా అభ్యర్థులు టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండటంతో కేంద్ర ఎన్నికల కమిటీకి తలనొప్పి తప్పడం లేదని తెలిసింది. నాయకులు మాత్రం ఈ సారి ఉమ్మడి జిల్లా తమదేనని ధీమాతో ఉన్నారు.
Khammam Congress MLA Tickets 2023 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టికెట్ల పోరు ఇప్పుడు జిల్లాలోని ముఖ్యనేతల మధ్య ప్రచ్చన్నయుద్ధానికి తెరలేపిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధానంగా వైరా, సత్తుపల్లి, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఆశావహ అభ్యర్థుల కన్నా.. ముఖ్యనేతల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరకముందే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పార్టీలో చేరే సమయంలో తన అనుచరవర్గానికి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం పలు నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సైతం పలు నియోజకవర్గాల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ భీష్మించారు. దీంతో ఓ వైపు పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని పార్టీ అధిష్ఠానం పదేపదే ప్రకటించినప్పటికీ.. నేతలు మాత్రం అనుయాయుల కోసం చివరి వరకు పోరాడుతున్నారు.
ఇదే సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు ఒకటి రెండు స్థానాలపై ప్రభావం చూపేలా ఉండటం.. అభ్యర్థుల ఎంపిక మరింత సంక్లిష్టంగా మారిందన్న వాదనలు ఉన్నాయి. వైరాలో రాందాస్ నాయక్, బాలాజీ నాయక్‌లలో ఒకరి కోసం భట్టి పట్టుబడుతుంటే.. విజయాభాయికి ఇవ్వాల్సిందేనని పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లిలో టికెట్ పోరు రసకందాయంలో పడింది. మట్టాదయానంద్ దంపతుల కోసం రేణుకాచౌదరి.. కొండూరి సుధాకర్ కోసం పొంగులేటి ఎవరికి వారు వెనక్కి తగ్గడం లేదు.
Telangana Assembly Elections 2023 : ఇదే సమయంలో సామాజిక సమీకణాల నేపథ్యంలో సత్తుపల్లి మాదిగలకు ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. 45 ఏళ్లుగా మాదిగలకు అన్యాయం జరుగుతున్నందున ఈసారి సత్తుపల్లి స్థానం మాదిగ కేటాయించాలని.. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉన్న కుటుంబానికి చెందిన తనకు టికెట్ ఇవ్వాలంటూ వక్కలగడ్డ చంద్రశేఖర్ ఏఐసీసీ అగ్రనేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానం సీపీఐకి కేటాయించడం ఖాయమన్న ప్రచారం ఉన్నా.. పొత్తు పెట్టుకోవద్దంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనలకు దిగారు. ఇల్లందులో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య కోసం పొంగులేటి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆయనకు టికెట్ ఇస్తే తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని ఆశావహ అభ్యర్థులు ప్రకటించడంతో.. టికెట్ పోరు ఆసక్తికరంగా మారింది. అశ్వారావుపేటలో ఆదినారాయణ కోసం పొంగులేటి.. సున్నం నాగమణి కోసం భట్టి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ తుమ్మల ఆశీస్సులతో తాటి వెంకటేశ్వర్లు సైతం టికెట్ ఆశిస్తున్నారు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు కోసం పొంగులేటి పట్టుబడుతుండగా.. ఇక్కడ పోలెబోయిన శ్రీవాణి, చందా సంతోష్, బట్టా విజయగాంధీ ఆశావహులుగా ఉన్నారు. దీంతో..అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు కత్తిమీద సాములా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో.. రెండో జాబితాలోనైనా అభ్యర్థుల లెక్కలు తేలుతాయా లేదా అన్నది కాంగ్రెస్ ఆశావహ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.